కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ కన్నుమూశారు. నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
కాచిగూడ రైలు ప్రమాదం - లోకో పైలట్ మృతి అసలేం జరిగిందంటే:
ఈ నెల 11న ఉదయం ఎంఎంటీఎస్ రైలు హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ప్రమాదంలో లోకో పైలట్ చంద్రశేఖర్ సహా 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కేబిన్‌లో ఇరుక్కుపోయిన చంద్రశేఖర్‌ను దాదాపు 8 గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. అనంతరం నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు.
కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూత
కుడి కాలులోని రక్తనాళాలు పూర్తిగా దెబ్బతినడంతో రక్త ప్రసరణ నిలిచిపోయింది. ఇన్‌ఫెక్షన్ శరీరం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉండటంతో మరో దారి లేక శస్త్రచికిత్స చేసి కుడి కాలును మోకాలు వరకు తొలగించారు. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చంద్రశేఖర్ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న రైల్వే అధికారులు, తోటి ఉద్యోగులు చంద్రశేఖర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఇవాళ అంత్యక్రియలు
చంద్రశేఖర్ భౌతికఖాయానికి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం అధికారులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. మరో వైపు అతని బంధువులు రైలు ప్రమాద ఘటనపై లోతుగా విచారణ జరిపి అసలు విషయాలు బయటపెట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడిన లోకో పైలట్ మృతి