ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తూ... జాతీయ హరిత ట్రైబ్యునల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విధి విధానాలపై అధ్యయనం చేసి 3 నెలల్లోపు నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన కేసును విచారించిన అనంతరం ట్రైబ్యునల్ ఈ ఉత్తర్వులిచ్చింది.
ఈ కమిటీ అయిదు అంశాలపై అధ్యయనం చేయాలని ఎన్‌జీటీ నిర్దేశించింది.
1. పోలవరం ప్రాజెక్టు నుంచి ఎంతమేర వ్యర్థాలు వెలికితీశారు? అందులో ఎంత భాగాన్ని డంపింగ్ సైట్‌లో పారవేశారు?
2. దీనివల్ల పర్యావరణానికి ఎంతమేర నష్టం జరిగింది? దిద్దుబాటు చర్యలేంటి?
3. భూమి కోల్పోయినవారికి ఇంకా పరిహారం చెల్లించాల్సి ఉందా?
4. ప్రాజెక్టు వ్యర్థాల పరిమాణంపై ఆడిట్ నిర్వహణ.
5. ఇతరత్రా ఏదైనా అంశాలపైనా పరిశీలించాలి.
కమిటీ కనీసం ఒకసారైనా ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించాలని, అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఎన్‌జీటీ పేర్కొంది. కేసు దాఖలు చేసిన పుల్లారావుకు ఖర్చుల నిమిత్తం పీసీబీ రూ. లక్ష చెల్లించాలని ఆదేశించింది. కేసు విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది. గతంలోనూ ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై జస్టిస్ శేషశయనారెడ్డి కమిటీనే ఎన్‌జీటీ నియమించింది.
ఇదీ చదవండి:వేధింపుల కాల్‌తో బయటపడ్డ అతిపెద్ద సైబర్‌క్రైం..!