Telangana high court cj : తెలంగాణ సీజేగా జస్టిస్ సతీష్ చంద్రశర్మ.. ఏపీకి జస్టిస్ ప్రశాంత్ - justice Satish chandra sharma news
సుప్రీంకోర్టు కొలీజియం మరో చరిత్రకు నాంది పలికింది. ఒకేసారి 8 మందికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి, ఐదుగురు సీజేఐల బదిలీలను ప్రదిపాదిస్తూ కేంద్రానికి సిఫార్సు చేసింది. సిఫార్సుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Telangana high court cj) స్థానంలో ప్రస్తుతం కర్ణాటక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పేరును సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసింది.
తెలంగాణ సీజేగా జస్టిస్ సతీష్ చంద్రశర్మ
By
Published : Sep 18, 2021, 9:30 AM IST
సుప్రీంకోర్టు కొలీజియం మరో చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 8 మందికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయిదుగురు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని ప్రతిపాదించింది. వ్యక్తిగత వినతులు, పరిపాలనా అవసరాల దృష్ట్యా ఒకేసారి 25 మంది న్యాయమూర్తుల బదిలీకి ఆమోదం తెలిపింది. మరో ముగ్గురి విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన కొలీజియం గత రెండు రోజులుగా విస్తృత కసరత్తు చేసి పూర్తి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పదోన్నతులు, బదిలీలు కలిపి మొత్తంగా 41 మందికి స్థాన చలనం కలగనుంది.
సిఫార్సుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది. తెలంగాణ నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో పాటు, ఇంకో న్యాయమూర్తి బదిలీ కానున్నారు. వారి బదులు ప్రధాన న్యాయమూర్తితో పాటు, మరో న్యాయమూర్తి రానున్నారు. ఆంధప్రదేశ్ నుంచి ప్రధాన న్యాయమూర్తి బదిలీ కాగా, అక్కడికి మరో ప్రధాన న్యాయమూర్తితో పాటు, కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు రానున్నారు.
జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖాళీ అయిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Telangana high court cj) స్థానంలో ప్రస్తుతం కర్ణాటక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ(Telangana high court cj) పేరును సిఫార్సు చేసింది. తెలంగాణలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావును పంజాబ్-హరియాణా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేయాలని ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్‌ను త్రిపుర హైకోర్టుకు బదిలీ చేస్తూ సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో సీనియర్ అయిన జస్టిస్ అకిల్ ఖురేషీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానానికి సిఫార్సు చేయకపోవడంతో గతంలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయనను త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానం నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. అక్కడున్న జస్టిస్ ఇంద్రజిత్ మహంతిని త్రిపురకు పంపాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సీజే జస్టిస్ అరూప్ గోస్వామిని ఛత్తీస్‌గఢ్ పంపాలని ప్రతిపాదించింది. ఏపీ హైకోర్టుకు పట్నా నుంచి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ నుంచి జస్టిస్ రవినాథ్ తిల్హరీలను బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.
బంగారు పతకాల విద్యార్థే నేటి ప్రధాన న్యాయమూర్తి
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Telangana high court cj)గా వచ్చే అవకాశం ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర(Telangana high court cj) శర్మ 1961 నవంబర్ 30న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.శర్మ భోపాల్‌లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ప్రాథమిక విద్య జబల్‌పూర్‌లోని సెంట్రల్ స్కూల్‌లో పూర్తి చేశారు. 1981లో సాగర్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందారు. మూడు సబ్జెక్టుల్లో డిస్టింక్షన్ సాధించి నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్‌ఎల్‌బీ డిగ్రీని పొందారు. అందులోనూ మూడు బంగారు పతకాలు సాధించారు. 1984 సెప్టెంబర్ 1న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1993లో అడిషినల్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2004లో సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా పదోన్నతి పొందారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉన్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తూవస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధానన్యాయమూర్తిగా బదిలీ కానున్నారు.
వారసత్వంగా న్యాయ విద్య
న్యాయమూర్తుల బదిలీల్లో తెలంగాణ హైకోర్టుకు బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది. ఆయన 1964 ఆగస్టు 2న గువాహటిలో జన్మించారు. తండ్రి సుచేంద్రనాథ్ భుయాన్ అస్సాం ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. ఉజ్జల్ ప్రాథమిక విద్య నుంచి ఎల్‌ఎల్‌ఎం వరకు మొత్తం విద్యాభ్యాసమంతా గువాహటిలోనే చేశారు. 1991 మార్చి 20న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 16 ఏళ్లపాటు ఆదాయపు పన్ను విభాగం స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు. 2002 ఏప్రిల్ నుంచి 2006 అక్టోబర్ వరకు మేఘాలయ ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా సేవలందించారు. 2005 నుంచి 2009 వరకు అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ అటవీశాఖ ప్రత్యేక న్యాయవాదిగానూ పనిచేశారు. 2010 సెప్టెంబర్ 6న గువాహటి హైకోర్టు ద్వారా సీనియర్ అడ్వకేట్ హోదా పొందారు. 2011 జులైలో అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2013 మార్చి 20న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 అక్టోబర్ 1న గువాహటి హైకోర్టు నుంచి బాంబేహైకోర్టుకు బదిలీ అయ్యారు.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ప్రస్థానం ఇదీ..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే అవకాశం ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గడ్‌లో జన్మించారు. బిలాస్‌పుర్‌లోని గురు ఘసీదాస్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాయగడ్ జిల్లా కోర్టుతోపాటు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2005 జనవరిలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గానూ పనిచేశారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యునిగా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్‌గా సేవలందించారు. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్‌గా పదోన్నతి పొందారు. 2009 డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్నారు.
వేగం పెంచిన కొలీజియం
ఉన్నత న్యాయస్థానాల్లో 40%కిపైగా ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీపై సుప్రీంకోర్టు కొలీజియం ప్రధాన దృష్టిసారించింది. జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఈ విషయంలో వేగం పెంచింది. కొలీజియం విస్తృత సంప్రదింపులు జరిపి, ఏకాభిప్రాయంతో గత నెలరోజుల్లో వివిధ హైకోర్టులకు 106 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ఆగస్టు 15 నుంచి కొలీజియం అవిశ్రాంతంగా పనిచేస్తూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ, కొలీజియం సభ్యుల మధ్య సంపూర్ణమైన ఏకాభిప్రాయం సాధించిన అనంతరమే కేంద్రానికి సిఫార్సు చేస్తున్నారు.