సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఎంపిక కావడంతో ఆయనతో కలిసి డిగ్రీ చదివినవారు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఎంపిక కావడంతో ఆయనతో కలిసి డిగ్రీ చదివినవారు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
మహిళలంటే ఆయనకు అమిత గౌరవం
ఆంధ్రప్రదేశ్‌లోని ధరణికోట డిగ్రీ కళాశాలలో 1976-79లో తరగతిలో తొమ్మిది మంది విద్యార్థులుండగా ఐదుగురు వృక్షశాస్త్రం, నలుగురు జంతుశాస్త్రం చదివేవాళ్లం. అందరూ మంచి స్నేహితులం. జస్టిస్ రమణతో కలిసి పీడీఎస్‌యూ విద్యార్థి సంఘంలో పనిచేశాను. మేము ఇద్దరం మంచి స్నేహితులం. ఆయన సామాజిక అంశాలపై విస్తృతమైన అవగాహన కలిగి ఉండేవారు. మహిళల పట్ల చాలా గౌరవంగా మెలిగేవారు. 1978లో కళాశాలలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. సైన్సు విద్యార్థి అయినా జనరల్, సామాజిక శాస్త్రాలు, తత్వశాస్త్ర పుస్తకాలు బాగా చదివేవారు. తెలుగుభాషపై అమితమైన ఆసక్తి కనబరిచేవారు.- పోసాని వెంకటేశ్వరరావు, సహ విద్యార్థి
- చక్కగా మాట్లాడి.. ఏకగ్రీవ ఎన్నిక
నేను ఎస్‌ఎఫ్‌ఐలో ఉండగా జస్టిస్ రమణ పీడీఎస్‌యూలో పనిచేసేవారు. మేమిద్దరం సామాజిక అంశాలపై చర్చించుకునేవాళ్లం. వేర్వేరు విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నా మంచి స్నేహితులం. కళాశాలలో విద్యార్థి నాయకుడి ఎంపిక సమయంలో ఎవరైతే బాగా మాట్లాడగలరో వారినే ఎంపిక చేస్తామని ప్రిన్సిపల్ పోటీపెడితే జస్టిస్ రమణ చక్కగా మాట్లాడటంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థులందరూ కలిసి అప్పట్లో బొటానికల్ టూర్‌లో భాగంగా గోవా, హుబ్లీ వెళ్లాం. సామాజిక బాధ్యత ఎక్కువగా ఉండటంతో అప్పట్లో వసతిగృహాల్లో సమస్యలపై పోరాటం చేసేవారు.