తెలంగాణ

telangana

ETV Bharat / city

మాతృభాష.. జాతి ఔన్నత్యానికి ప్రతీక : జస్టిస్‌ ఎన్‌.వి.రమణ - telangana news

మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించారు. మాతృభాష..జాతి ఔన్నత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న అంతర్జాల అష్టావధానాన్ని ప్రారంభించిన ఆయన.. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురాభిమాని కాదన్నారు.

justice-nv-ramana-comments-on-telugu-language
CJI NV Ramana: మాతృభాష.. జాతి ఔన్నత్యానికి ప్రతీక : జస్టిస్‌ ఎన్వీ రమణ

By

Published : Jul 18, 2021, 4:29 PM IST

Updated : Jul 20, 2021, 6:17 AM IST

‘‘మాతృభాష అనేది జాతి ఔన్నత్యానికి ప్రతీక. తెలుగువాడు భాషాభిమానేకానీ దురభిమాని కాడు. భాషను కాపాడుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలి. తెలుగు భాషకు పట్టాభిషేకం చేయడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. తిరుపతికి చెందిన ‘అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌’ సంస్థ ఆదివారం మహా సహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ‘శ్రీవేంకటేశ్వరాంకిత చతుర్గుణిత అష్టావధానం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా, ప్రథమ ప్రాశ్నికులుగా పాల్గొని మాట్లాడారు.

‘‘అసాధారణమైన ఈ అవధాన ప్రక్రియ తెలుగుభాషకు ప్రత్యేకం. అసాధారణ మేధస్సు, భాషా వ్యాకరణాలపై తిరుగులేని పట్టు, అద్భుతమైన జ్ఞాపకశక్తి మేళవింపే అవధానం. శ్రీవేంకటేశ్వరుడి ఆశీర్వచనంతోనే ఇది సాధ్యం. అలాంటి అశీర్వచనాలు పుష్కలంగా పొందినవారిలో మేడసాని మోహన్‌ ఒకరు. ఆయనను తొలిప్రశ్న అడిగే అవకాశం రావడం నా మహాభాగ్యం. భాషాభిమానిగా, సాహితీ ప్రియునిగా నాకున్న కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను’’ అని సీజేఐ పేర్కొన్నారు.

ప్రోత్సహించడం.. గురుతర కర్తవ్యం

‘‘అవధానం దాదాపు వెయ్యేళ్ల కాలంలో పరిణతి చెందిన సాహితీ ప్రక్రియ. దీన్ని కాపాడుకొని, ప్రోత్సహించడం మన గురుతర కర్తవ్యం. కేరళలోని కూడియట్టం అనే ఒక నాట్యగాన ప్రక్రియ ఒకప్పుడు ఎంతో ఆదరణ కలిగి ఉండేది. సంస్కృతం అర్థంకాక, సమయం వెచ్చించలేక ఆ కళకు పోషకులు దూరమయ్యారు. ప్రభుత్వ ఆదరణతో అతికష్టం మీద కూడియట్టం మనుగడ సాగించగలుగుతోంది. ఒక భాషా ఛాందసుడు నాకు మంచి మిత్రుడు. ఇంట్లో దూరిన పిల్లిని తరమడానికి భార్యకు ‘ఓ ప్రేయసీ లలామా... మదీయ గృహాంతరమ్మున మార్జాలంబేగి క్షీరంబును గ్రోలుచున్నది. నీవు సత్వరం వెడలి అద్దానిన్‌ పారంద్రోలుమ్‌’ అని గ్రాంధికంలో చెప్పారు. ఆదేశం అర్థమయ్యేలోగా పిల్లి తన పని పూర్తిచేసుకుపోయింది. అందుకే మూల స్వరూపంతో పెద్దగా రాజీపడకుండా, ఒకింత జనరంజకంగా, సాధారణ ప్రజలను సైతం ఆకర్షించే విధంగా మన సాహితీ ప్రక్రియలను మలచుకోవాల్సిన అవసరం ఉంది."

-జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈ సందర్భంగా ఆయన తొలి ప్రాశ్నికులుగా ఆది, సోమ, మంగళ, బుధ అనే పదాలను వారాల అర్థంలో కాకుండా అన్యార్థంలో ప్రయోగిస్తూ శ్రీవేంకటేశ్వర స్వామి వారు కరోనా నుంచి యావత్‌ ప్రపంచాన్ని రక్షించుగాక అనే భావనతో పద్యం చెప్పమని అవధానిని కోరారు. మేడసాని మోహన్‌ చక్కటి సీస పద్యంతో జవాబు చెప్పి అలరించారు.

ఇదీ చదవండి:బిల్లుల అజెండాతో కేంద్రం- ధరల అస్త్రంతో విపక్షం

Last Updated : Jul 20, 2021, 6:17 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details