ఒకప్పుడు 50ఏళ్లు దాటిన వారే అనారోగ్యానికి గురైయ్యేవారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి వల్ల చిన్న వయసులోనే రోగాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, నిద్ర, పనివేళలు మారడంతో శరీరంలో సమతుల్యత లోపిస్తోంది. దీనివల్ల దీర్ఘకాలిక జబ్బులు ప్రబలుతున్నాయి. 2000 నుంచి 2014 మధ్య అంటువ్యాధులు తగ్గి, జీవనశైలి వ్యాధుల వ్యాప్తి ఎక్కువైంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే జేబులకు చిల్లు పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సగటున 13 వేల 10, పట్టణ ప్రాంతాల్లో 30 వేల 718 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.
గణనీయంగా జీవనశైలి వ్యాధులు...
2000 నుంచి 2014 మధ్య రాష్ట్రంలో... జీవనశైలి వ్యాధులు 29 శాతం నుంచి 59 శాతానికి చేరినట్లు వైద్య సంస్కరణ కమిటీ పరిశీలనలో తేలింది. గుండెపోటు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, రక్తపోటు, చెక్కరవ్యాధి, క్యాన్సర్ వంటి జబ్బుల బాధితులు గణనీయంగా పెరిగారు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 7 శాతం మంది చక్కెరవ్యాధి, 20 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. రక్తహీనత, నెలలు నిండకుండానే పుట్టడం, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
ఫాస్ట్ఫుడ్ వల్లే...
వీటితోపాటు వచ్చే ఇతర అనారోగ్య సమస్యల్ని తగ్గించుకునేందుకు ప్రజలు అధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని వైద్య రంగ సంస్కరణల కమిటీ సభ్యులు అంటున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ ఆహారంగా తీసుకోవడం వల్లే జీవనశైలి వ్యాధులు ప్రబలుతున్నాయని సంస్కరణల కమిటీ సభ్యులు చెబుతున్నారు.