ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ వైద్యులను అకారణంగా సస్పెండ్ చేయడంపై జూనియర్ వైద్యుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సరిపడా మందులను వెంటనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసింది. రోగులను కాపాడేందుకే అత్యవసర మందుల కోసం వైద్యులు బయటికి రాస్తున్నారని జూడాలు స్పష్టం చేశారు. మందులు అందుబాటులో ఉన్నా కూడా రాయని వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎలాంటి దర్యాప్తు లేకుండా వైద్యులను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. రోగులకు అవసరమైన మందుల కోసం ఇండెంట్ పెడుతున్నా.. సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ప్రైవేటు మెడికల్ దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యుల ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంఘీబావం ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి రోగులకు అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కోరింది.