సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల (జూడాలు) ధర్నా కొనసాగుతోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతిచెందాడంటూ గాంధీ ఆసుపత్రిలోని జూనియర్ వైద్యుడిపై మంగళవారం మృతుడి బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ నిన్న రాత్రి ఆస్పత్రి ముందు జూడాలు బైఠాయించారు.
గాంధీలో జూడాల ధర్నా.. 300 మంది విధుల బహిష్కరణ - Medicos at Gandhi Hospital continue to protest
గాంధీలో జూడాలు ధర్నాకు దిగారు. కరోనాతో వ్యక్తి మృతిచెందగా బంధువులు వైద్యుడిపై దాడికి దిగారు. దీనిని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి 8.30 గంటల నుంచి 300 మంది జూనియర్ వైద్యులు నిరసన కొనసాగిస్తున్నారు.
నిన్న రాత్రి 8.30 గంటల నుంచి 300 మంది జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు జూనియర్ వైద్యులు ఇప్పటికే మంత్రి ఈటలను కలిశారు. విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా కొవిడ్ పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జూనియర్ వైద్యులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. మరోవైపు జూనియర్ వైద్యుడిపై దాడికి సంబంధించి చిలకలగూడ పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు.