తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజకీయం రసవత్తరం... గ్రేటర్​లో వలసల పర్వం - తెలంగాణ తాజా వార్తలు

నిన్నటి దాకా ఒక నినాదం. ఇవాళ సీటు ఎవరిస్తారనేదే ప్రధానం. రేపు ఎక్కడుంటారనేది అనవసరం. పార్టీ ఏదైనా.. టికెట్‌ దక్కటమే ముఖ్యం. నాయకులు ఎవరైనా... గెలవటమే లక్ష్యం. బల్దియా ఎన్నికల వేళ రాజకీయ నేతల పక్కచూపులు.. అసంతృప్తులకు పార్టీల గాలాలు ముమ్మరమయ్యాయి. దొరికితే అధికార పార్టీ... లేదంటే అవకాశమిచ్చిన పార్టీ. ఇలా టికెట్ల అన్వేషణతో ఎన్నికల వేళ ఆశావహుల వలసలతో గ్రేటర్‌ పోరు రసవత్తరంగా సాగుతోంది.

jumping political leaders
రంజుగా బల్దియా రాజకీయం.. జోరందుకున్న వలసలు

By

Published : Nov 18, 2020, 7:57 PM IST

టికెట్‌ ఇస్తే ఒక నినాదం. రాకపోతే మరో నినాదం. ఇలా... టికెట్ల కోసం నేతల వలసలు, సీట్ల కోసం పార్టీల పాట్లతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బల్దియా ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ వెలువడిన మరుక్షణమే... నేతల టికెట్‌ రాజకీయాలు ఊపందుకున్నాయి.

అభ్యర్థుల ఎంపిక విషయంలో శాసనసభ ఎన్నికల వ్యూహాన్నే గ్రేటర్ ఎన్నికల్లోనూ అమలు చేసే దిశగా... అధికార తెరాస నిర్ణయించినట్లు తెలుస్తోంది. తీవ్రమైన అభియోగాలుండి పార్టీకి నష్టదాయకం, తప్పనిసరి అనుకున్న వారిని మాత్రమే మినహాయించాలని పార్టీ భావించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెరాస తరఫున 99 మంది కార్పొరేటర్లు గెలవగా.. ఆ తర్వాత మరో ముగ్గురు ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరారు. అంతర్గత సర్వేలో చిన్నాచితకా మినహా ఎక్కడా కార్పొరేటర్లపై వ్యతిరేకత లేదని తేల్చిన నాయకత్వం.. రిజర్వేషన్లూ యథాతథంగా ఉన్నందున ప్రస్తుత కార్పొరేటర్లకే మళ్లీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

అభ్యర్థుల జాబితా కేటాయించిన తర్వాత అసంతృప్తులు, అసమ్మతులకు.. విపక్షాలు గాలం వేసే అవకాశం ఉన్నందున.. వారిని బుజ్జగించేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే అభ్యర్థుల జాబితా ప్రకటనపై ఆచితూచి వ్యవహరిస్తోంది. టికెట్‌ ఆశిస్తున్న వారిని చివరి వరకు ఆశల పల్లకిలోనే ఉంచి... పార్టీ ప్రకటించిన వారికి బీ ఫారం ఇవ్వాలని భావిస్తోంది.

ఆ ఇద్దరిదీ అదే దోస్తీ...

గతంలో మాదిరిగానే ఎంఐఎం, అధికార పార్టీల స్నేహపూర్వక బంధం ఈ ఎన్నికల్లోనూ కొనసాగనుంది. తెరాస అభ్యర్థులు పోటీచేస్తున్న 150 డివిజన్లలో.... దాదాపు 50 స్థానాల్లో మజ్లిస్‌ స్నేహపూర్వకంగా పోటీకి దిగింది. ఇటీవల ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో తెరాస అధినేత కేసీఆర్ చర్చించారు.

దుబ్బాక జోరులో భాజపా..

గత సార్వత్రిక ఎన్నికలు, దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలతో జోరుమీదున్న భాజపా... గ్రేటర్‌లోనూ సత్తాచాటాలని భావిస్తోంది. నోటిఫికేషన్‌ సంకేతాలు వెలువడిన నాటి నుంచే సర్వేలు ప్రారంభించి... డివిజన్లవారీగా బలమైన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. పార్టీ నుంచి గెలిచిన, ఇతర పార్టీల నుంచి వచ్చిన సిట్టింగ్‌ కార్పొరేటర్లకు టికెట్‌ ఇవ్వాలని కమలదళం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. తెరాస, కాంగ్రెస్‌లో అసంతృప్తులు, టికెట్‌ దక్కే అవకాశంలేని బలమైన నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే.. హస్తం నేతలు నరసింహారెడ్డి, బండ కార్తీక, బిక్షపతి యాదవ్ కుమారుడు రవి యాదవ్​ కషాయ పార్టీలో చేరారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నిర్ణయించిన వారితో తొలి జాబితాను విడుదల చేసి... మిగతా అభ్యర్థులను శుక్రవారంలోగా ప్రకటించాలని కమలదళం భావిస్తోంది. అప్పటిలోగా తెరాస, కాంగ్రెస్‌లో అసంతృప్తులను చేర్చుకుని... బరిలోకి దించాలని యోచిస్తున్నారు.

వలసలతో కాంగ్రెస్ సతమతం​..

బల్దియా పోరులో వలసలతో కాంగ్రెస్‌ సతమతమవుతోంది. ఇప్పటికే కొందరు భాజపా వైపు చూస్తుండగా... పార్టీ నాయకత్వంతో తీరుతో మరికొందరు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోవడం, గతంలో పదవుల్లో ఉన్న వారే పార్టీని వీడుతుండటం హస్తం నేతలను కలవరానికి గురిచేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర బాధ్యుడు మాణిక్కం ఠాగూర్‌ పార్టీ నేతలతో సమావేశమై పరిస్థితిని చర్చిస్తున్నారు. బలమైన నేతలను భాజపా గాలం వేస్తుండటం పట్ల అప్రమత్తం కాకుంటే మరింత నష్టం తప్పదని ఆ పార్టీ సీనియర్‌లు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details