యువ పశు వైద్యురాలు 'దిశ' హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ ఆరు నెలల్లోనే పూర్తిచేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. విచారణ చేయనున్న త్రిసభ్య సంఘం సభ్యులు త్వరలోనే హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాలు అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారికి కార్యాలయం, వసతి సౌకర్యం కల్పించనుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన తెలంగాణలో పోలీసు కాల్పులు కొత్తకాదు. ఈ మధ్యకాలంలో కొంత తగ్గినప్పటికీ అడపాదడపా పోలీసు కాల్పుల్లో మావోయిస్టులు మరణిస్తూనే ఉన్నారు. ఉగ్రవాదిగా ముద్రపడ్డ వికారుద్దీన్, అతడి నలుగురు అనుచరులు 2015లో ఆలేరు వద్ద పోలీసులతో జరిపిన ఎదురు కాల్పుల్లో చనిపోయారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలనే డిమాండు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సిట్‌తోనే సరిపెట్టింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2007లో ఖమ్మం జిల్లా ముదిగొండలో జరిగిన కాల్పుల ఘటనపై మాత్రం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పాండురంగారావు నేతృత్వంలో జ్యుడీషియల్ విచారణ జరిగింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి జ్యుడీషియల్ విచారణ ఇదే. సివిల్‌కోర్టు అధికారాలు ఉండే త్రిసభ్య సంఘం స్థానికంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుంటుంది.
సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఎదురు కాల్పులకు సంబంధించిన అన్ని అంశాలను ఈ కమిషన్ విచారిస్తుంది. దీనిలో భాగంగా సంఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు కాల్పుల్లో చనిపోయిన నిందితుల కుటుంబ సభ్యులు, దిశ కుటుంబ సభ్యులు, సాక్షులను విచారిస్తుంది. ఫోరెన్సిక్ నివేదికలను పరిశీలిస్తుంది. ఈ కేసులో సంబంధం ఉందని భావించిన ఎవరినైనా విచారించే అధికారం కమిషన్‌కు ఉంటుంది.