Telangana HC on BJP MLAs Suspension : శాసనసభలో భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. నిన్న(మార్చి 9న) హైకోర్టు జారీ చేసిన నోటీసులు అసెంబ్లీ కార్యదర్శికి అందలేదు. భాజపా ఎమ్మెల్యేలు, అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న న్యాయస్థానం ఉత్తర్వులు రేపు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు జారీ చేస్తామని తెలిపింది. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ను సవాల్ చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ వాదనలు విన్నారు. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు నిన్న అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ.. విఫలమయ్యాయని పిటిషనర్లు, హైకోర్టు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా..
రాజ్యాంగ విరుద్ధంగా, శాసనసభ నియమావళిని ఉల్లంఘించి సస్పెండ్ చేశారని భాజపా ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వాదించారు. సభ నిర్వహణకు ఆటంకం కలగకపోయినా... స్పీకర్ ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా... సస్పెన్షన్ తీర్మానం ప్రవేశ పెట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీ నిర్వహణలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. తీర్పు రేపటికి వాయిదా వేసింది.