Hyderabad Pub Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పుడింగ్ పబ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. పబ్‌లో దొరికిన మాదకద్రవ్యాలకు అభిషేక్, అనిల్‌కు ఎలాంటి సంబంధం లేదని.. బెయిల్ మంజూరు చేయాలని... నిందితుల తరఫు న్యాయవాది నిన్న వాదనలు వినిపించారు. కాగా.. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ నేడు పోలీసుల తరఫు న్యాయవాది దుర్గాజీ వాదించారు.
పబ్‌లో కొకైన్ దొరికినప్పుడు పూర్తిగా నిర్వాహకులే బాధ్యత వహించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పబ్‌లోకి ప్రవేశించే ముందే ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసి పంపిస్తారని.. వినియోగదారులు డ్రగ్స్‌ను లోపలికి తీసుకెళ్లే అవకాశమే లేదని దుర్గాజీ వాదించారు. పబ్ నిర్వాహకులే కొకైన్ విక్రయించే అవకాశం ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిగా వివరాలు సేకరించడానికి పోలీసులకు మరికొంత సమయం కావాలన్నారు. నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని... సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజీ వాదించారు.
పోలీసులు ఇప్పటికే అభిషేక్, అనిల్‌ను నాలుగు రోజుల కస్టడీకి తీసుకొని ప్రశ్నించారని, కొకైన్ విక్రయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని నిందితుల తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. బెయిల్ ఇవ్వాలని.. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.