తెలంగాణ

telangana

ETV Bharat / city

JNTU: పీహెచ్‌డీ పట్టా ఉంటేనే.. అధ్యాపక కొలువు

ఇంజినీరింగ్‌ కళాశాలలకు జేఎన్‌టీయూహెచ్‌ మరో షాక్‌ ఇచ్చింది. సైన్స్‌, హ్యుమానిటీస్‌ అధ్యాపకులుగా పనిచేయడానికి కొత్త నిబంధన తీసుకువచ్చింది. అధ్యాపకులకు పీహెచ్‌డీ తప్పనిసరి అన్న నిబంధన విధించింది. అది లేకపోతే నెట్‌, స్లెట్‌లలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.

JNTU
JNTU: పీహెచ్‌డీ పట్టా ఉంటేనే.. అధ్యాపక కొలువు

By

Published : Aug 12, 2021, 11:59 AM IST

ఇంజినీరింగ్‌, ఫార్మసీ తదితర కళాశాలల యాజమాన్యాలకు జేఎన్‌టీయూహెచ్‌ మరో షాక్‌ ఇచ్చింది. ప్రిన్సిపాళ్లకు పీహెచ్‌డీతోపాటు 15 సంవత్సరాల అధ్యాపక అనుభవం, ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించి ఉండాలి అన్న నిబంధనలను అమలులోకి తీసుకొచ్చిన విశ్వవిద్యాలయం.. తాజాగా సైన్స్‌, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులకు పీహెచ్‌డీ తప్పనిసరి అన్న నిబంధన విధించింది. అది లేనిపక్షంలో నెట్‌, స్లెట్‌లలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. కళాశాలల యాజమాన్యాలు ఎంపిక చేసుకున్న అధ్యాపకులకు విశ్వవిద్యాలయం ఆమోదం ఉండాలి. అధ్యాపకులకు అర్హతలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను పరిశీలించి ఆమోదం తెలిపేందుకు తాజాగా విశ్వవిద్యాలయంలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. తగిన విద్యార్హతలు లేకపోవడంతో 90 శాతానికిపైగా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని సమాచారం. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మంజూరు చేసే ప్రతి 180 సీట్లకు ఆ సబ్జెక్టులకు ఒక్కో అధ్యాపకుడు అవసరం.

విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులుగా పనిచేయాలంటే పీహెచ్‌డీ తప్పనిసరి అని, డిగ్రీ తదితర కళాశాలల్లో పనిచేయడానికి నెట్‌, స్లెట్‌లలో ఏదో ఒక అర్హత ఉండాలని యూజీసీ 2018లోనే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాలనే పాటించాలని ఏఐసీటీఈ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో రెండేళ్లలో నెట్‌లోగానీ, స్లెట్‌లోగానీ అర్హత సాధిస్తామన్న షరతులపై అధ్యాపకులకు జేఎన్‌టీయూహెచ్‌ అనుమతి ఇచ్చింది. తాజాగా కొత్తగా నియమించుకునే వారికి ఈ నిబంధన అమలుచేసింది. అకస్మాత్తుగా ఈ నిబంధన అమలు చేస్తుండటంతో యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. విద్యార్హతలు లేని వారికి నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఇస్తే.. పీహెచ్‌డీ/నెట్‌/స్లెట్‌ ఉన్న వారికి రెట్టింపు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుందని కలవరపడుతున్నాయి. కొత్త నిబంధన వల్ల సుమారు 150 కళాశాలలపై ప్రభావం పడనుంది.

నిబంధనలు సడలించాలని వినతులు

కరోనా కారణంగా రెండేళ్ల నుంచి దేశవ్యాప్తంగా నెట్‌, స్లెట్‌లు నిర్వహించడం లేదని, ఈ సారికి ఈ నిబంధనను సడలించాలని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఉపకులపతి నర్సింహారెడ్డికి విన్నవించాయి. ఇప్పటికిప్పుడు ఆ విద్యార్హతలు ఉన్నవారు దొరకరు అని కొందరు ప్రస్తావించగా.. అదే సమస్య అయితే ఆ విద్యార్హతలు ఉన్న వారి జాబితాను తాము ఇస్తామని వీసీ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య మంజూర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. ఏఐసీటీఈ ఇచ్చిన ఉత్తర్వులనే అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: ENGINEERING IN TELUGU: తెలుగులో బీటెక్‌.. ఈసారి లేనట్టేనా?

ABOUT THE AUTHOR

...view details