అనుబంధాల కుటుంబం...
మా చిన్నపుడు నాన్న ముకేశ్ కంపెనీ పనుల్లో చాలా బిజీగా ఉండేవారు. ఎంత బిజీగా ఉన్నాసరే అవసరమైనప్పుడు అందుబాటులో ఉండేవారు. అమ్మ నీతా చాలా స్ట్రిక్ట్. ఎప్పుడైనా స్కూల్‌కి వెళ్లనంటే నాన్న సరే అనేవారు. అమ్మ మాత్రం ఒప్పుకునేది కాదు. తిండి, చదువు, ఆట... అన్నీ టైమ్‌కి జరగాలనేది.
తాతయ్యతోనూ నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. స్వాతంత్య్ర పోరాటం గురించి చెప్పేవారు. అవన్నీ విని పెద్దయ్యాక సైన్యంలో చేరాలనుకునేదాన్ని. నాన్నమ్మ కోకిలాబెన్ కుటుంబాన్ని ఒకే తాటిమీద ఉంచే వ్యక్తి. స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ చేస్తున్నపుడు నాతోపాటు రెండు నెలలు ఉంది. నా పెళ్లిలో కబుర్లు చెబుతూ, పాటలు పాడుతూ, గర్బా డ్యాన్స్ చేస్తూ చాలా హడావుడి చేసింది. వీరందరూ డబ్బు విలువనీ, కష్డపడే తత్వాన్నీ, అణకువగా ఉండటాన్నీ చిన్నప్పట్నుంచీ నేర్పారు.
అమెరికాలో చదువు...
యేల్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేశా. ఇంట్లో సౌకర్యాల్ని వదిలి బంక్ బెడ్ మీద నిద్రపోవడం, కమ్యూనిటీ టాయిలెట్స్ ఉపయోగించడం, మ్యాగీ నూడిల్స్‌తో ఆకలి తీర్చుకోవడం... ఇలా ఎన్నో అనుభవ పాఠాలు నేర్చుకున్నానక్కడ. యేల్, స్టాన్‌ఫర్డ్‌లలో చదువూ, మెకన్సీలో ఉద్యోగం... జీవితంలో మర్చిపోలేను. మెకన్సీలో ఎంతో ప్రతిభావంతులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అనుభవాలు నా ఆలోచనా పరిధిని పెంచాయి.
జియోనే జీవితం
మెకన్సీలో ఏడాదిన్నర పనిచేశాక 2014లో భారత్ తిరిగొచ్చిన వెంటనే జియో ప్రారంభించాం. ఆలోచన దశ నుంచి ‘జియో’లో భాగంగా ఉన్నా. సిబ్బంది నియామకం, మార్కెటింగ్, బ్రాండింగ్... ఈ పనులన్నీ చూసుకున్నా. రెండేళ్లపాటు నిద్రలో తప్ప మేల్కొని ఉన్న ప్రతి నిమిషం జియో గురించే ఆలోచించేదాన్ని.
2015లో జియో సేవలు మొదలైన ఏడాది తరువాత ఎంబీఏ చేయడానికి మరోసారి అమెరికా వెళ్లా. అక్కణ్నుంచీ డైరెక్టర్‌గా పనిచేశా. రెండేళ్లలో చివరి ఆరు నెలలు మాత్రమే పూర్తిగా ఎంబీఏ పరీక్షల మీద దృష్టిపెట్టా. తిరిగొచ్చాక మళ్లీ జియోతో బిజీ అయిపోయా. నా కలల ప్రాజెక్టుగా జియోకి ఎప్పటికీ మనసులో చోటుంటుంది.
జియో యూనివర్సిటీ వస్తోంది..
నా సమయాన్ని జియోతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫౌండేషన్‌లకీ కేటాయిస్తున్నా. రోజులో 14 గంటలు పని చేస్తా. పనిలోపడి తెల్లవారుజాము మూడు, నాలుగింటివరకూ నిద్రపోని రోజులూ ఉన్నాయి. భారతీయ కళల్ని ప్రపంచానికి చూపించడానికీ, విదేశీ కళల్ని మన దేశానికి తెచ్చేందుకూ రిలయన్స్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఏర్పాటుచేశా.