తెలంగాణ వ్యాప్తంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ... మహనీయునికి నివాళులర్పించారు. వరంగల్‌లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ విగ్రహానికి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రాభివృద్ధిలో జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పారు. తొర్రూరులోనూ ఏర్పాటుచేసిన జయశంకర్ జయంతి వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం అనుక్షణం పరితపించారు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనుక్షణం పరితపించిన మహోన్నత వ్యక్తి... ఆచార్య జయశంకర్ అని మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జయశంకర్ 87వ జయంతి సందర్భంగా.. నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, సిద్దిపేటలో హరీశ్‌రావు... ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు... విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొని ప్రజలను చైతన్యపరిచిన మహానీయుడని కొనియాడారు. ముఖ్యమంత్రి జయశంకర్ స్ఫూర్తితోనే సీఎం ముందుకు వెళ్తున్నారని అన్నారు.
తెరాస ఎంపీలు నివాళులు
ఆచార్య జయశంకర్ కలలుగన్న తెలంగాణను... కేసీఆర్ ఆధ్వర్యంలో నెరవేర్చుంటున్నామని... తెరాస ఎంపీలు పేర్కొన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా... ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని ఎంపీలు తెలిపారు.