తెలంగాణ

telangana

ETV Bharat / city

AP CMO: జవహర్‌రెడ్డికి ఏపీ సీఎంవోలో కీలక బాధ్యతలు - AP News

AP CMO: ముఖ్యమంత్రి కార్యాలయంలోని నలుగురు ఐఏఎస్‌ అధికారులకు శాఖలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి సీఎంవోలో ఇటీవల బాధ్యతలు చేపట్టడంతో... అధికారులకు మళ్లీ శాఖల విభజన చేశారు. హోం, రెవెన్యూ, సాధారణ పరిపాలన వంటి కీలక శాఖల్ని ఆయనే పర్యవేక్షించనున్నారు.

AP CMO: జవహర్‌రెడ్డికి ఏపీ సీఎంవోలో కీలక బాధ్యతలు
AP CMO: జవహర్‌రెడ్డికి ఏపీ సీఎంవోలో కీలక బాధ్యతలు

By

Published : Mar 3, 2022, 7:12 AM IST

AP CMO: ఏపీలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని నలుగురు ఐఏఎస్‌ అధికారులకు శాఖలు కేటాయిస్తూ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి సీఎంవోలో ఇటీవల బాధ్యతలు చేపట్టడంతో... అధికారులకు మళ్లీ శాఖల విభజన చేశారు. హోం, రెవెన్యూ, సాధారణ పరిపాలన వంటి కీలక శాఖల్ని ఆయనే పర్యవేక్షించనున్నారు. సీఎంవోలో అధికారులకు కేటాయించిన శాఖలివీ..

జవహర్‌రెడ్డి (ప్రత్యేక ప్రధాన కార్యదర్శి)

సాధారణ పరిపాలనశాఖ, హోం, రెవెన్యూ (పన్నులు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, దేవాదాయ), పర్యావరణం, అడవులు, శాస్త్ర, సాంకేతిక, వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, న్యాయ, శాసనసభా వ్యవహారాలు, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు, మౌలిక వసతులు- పెట్టుబడులు, కేంద్రంతో సంప్రదింపులు, ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలు, ఎవరికీ కేటాయించని శాఖలు.

సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ (కార్యదర్శి)

ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, విద్య (పాఠశాల, ఇంటర్మీడియట్‌, ఉన్నత, సాంకేతిక), పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సెర్ప్‌, గనులు- భూగర్భ ఖనిజ సంపద, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, అన్ని సంక్షేమ శాఖలు

కె.ధనుంజయరెడ్డి (కార్యదర్శి)

ఆర్థిక, ప్రణాళిక, జలవనరులు, వ్యవసాయం, అనుబంధ శాఖలు, పురపాలక, పట్టణాభివృద్ధి, సీఆర్‌డీఏ, ఇంధనశాఖ, పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాలు, క్రీడలు, మార్కెటింగ్‌, సహకార శాఖలు

రేవు ముత్యాలరాజు (అదనపు కార్యదర్శి)

ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, విజ్ఞప్తులు, రెవెన్యూ (భూములు, రిజిస్ట్రేషన్‌, స్టాంపులు, సర్వే, భూ రికార్డులు, సీఎంఆర్‌ఎఫ్‌, విపత్తు నివారణ), గృహనిర్మాణం (వైఎస్సార్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలు, 90 రోజుల్లో ఇళ్ల పట్టా కార్యక్రమం సహా), రవాణా, రోడ్లు భవనాలు, ఏపీఎస్‌ఆర్టీసీ, కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శాఖలు

అజేయ కల్లం సహా మిగతావారికి శాఖల్లేవు!

సీఎంవోలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మిగతావారికి శాఖల్లేవు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎం కార్యాలయంలో హోం, సాధారణ పరిపాలన, రెవెన్యూ వంటి కీలక శాఖల్ని సీఎం ముఖ్య సలహాదారు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం పర్యవేక్షించేవారు. సీఎంవో మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచేది. మరో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.వి.రమేష్‌ కూడా కీలక బాధ్యతలు నిర్వహించేవారు. వారితో పాటు దువ్వూరి కృష్ణ, హరికృష్ణలకు కొన్ని శాఖలు/విభాగాలపై పర్యవేక్షణ ఉండేది. ప్రవీణ్‌ ప్రకాష్‌ సీఎం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక... సీఎంవోలో పనిచేసేవారిలో సర్వీసులో ఉన్న ఐఏఎస్‌ అధికారులకు తప్ప ఎవరికీ అధికారికంగా శాఖలు ఉండరాదని నిబంధన తెచ్చారు. అజేయ కల్లం, పీవీ రమేష్‌, మురళి వంటి విశ్రాంత ఐఏఎస్‌ అధికారులతో పాటు, ఇతరుల నుంచీ శాఖలు తీసేశారు. ఐఏఎస్‌ అధికారులతో పాటు, మిగతావారు కూడా కొన్ని సబ్జెక్టుల్ని పర్యవేక్షిస్తున్నా, అధికారికంగా వారికి శాఖల కేటాయింపు లేదు. ప్రస్తుతం అజేయకల్లం జిల్లాల పునర్విభజన, భూముల సర్వే అంశాల్ని చూస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ స్టేట్‌ పోర్టల్‌లో సీఎంవోలో పనిచేసే అధికారులు, వారు పర్యవేక్షిస్తున్న శాఖల జాబితాను బుధవారం అప్‌డేట్‌ చేశారు. దానిలో నలుగురు ఐఏఎస్‌ అధికారులు మినహా.. మిగతా వారి హోదా మాత్రమే ప్రస్తావించారు. శాఖలు అని ఉన్నచోట గీత పెట్టారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details