Jawad cyclone in AP: జవాద్ తుపాను నేపథ్యంలో ఏపీలోని విజయనగరం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ సూర్య కుమారి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మెంటాడ మండలం ఆండ్ర రిజర్వాయర్ను పరిశీలించి.. డ్యాం భద్రతకు చేపట్టిన చర్యలు, రిజర్వాయర్లో ప్రస్తుత నీటి నిల్వ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. ఒక గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసి.. రిజర్వాయర్ నీటి పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ సుగుణాకర రావు కలెక్టర్కు వివరించారు.
సహాయక బృందాలు సిద్ధం
Alert on jawad cyclone: తుపాను ముప్పు పొంచి ఉన్నందున జిల్లా ప్రజలు, రైతులను అప్రమత్తం చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. వైద్య, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశమున్న గ్రామాల్లో ముందుగానే నాలుగు రోజులకు అవసరమైన రేషన్ సరుకులు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. గాలులు ఉద్ధృతంగా వీచే అవకాశం ఉన్నందున.. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ వెల్లడించారు.
పాఠశాలలకు సెలవులు
effect on schools: తుపాను హెచ్చరికలతో జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలలు, అంగన్వాడీలకు కలెక్టర్ సూర్యకుమారి సెలవులు ప్రకటించారు. తుపాను సహాయక చర్యల ప్రత్యేక అధికారిగా కాంతిలాల్ దండేను నియమించారు.