Jawad cyclone effect in Andhra pradesh : జవాద్ తుపాను.. మరింత బలపడి తీవ్రతుపానుగా మారనుంది. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి అక్కడి నుంచి ఉత్తర దిశగా కదులుతూ 5వ తేదీ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దీని ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పుర్ జిల్లాల్లో అధికారులు శనివారానికి రెడ్ ఎలర్ట్ జారీచేశారు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 420 కిలోమీటర్లు, గోపాల్‌పుర్‌కు ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది.
జవాద్ తుపాను ఒడిశాలోని పూరీ జిల్లాలో ఆదివారం తీరం దాటి, తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని ఒడిశా ప్రత్యేక సహాయ కమిషనర్ పీకే జెనా తెలిపారు. తీరం దాటే సమయంలో 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అయితే, దిశ మార్చుకుని ఒడిశా మీదుగా వెళ్తూ తీరం దాటకపోవచ్చని ఆయన చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే తీరం వెంబడి గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కన్నబాబు తెలిపారు. శనివారం ఉదయానికి గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. తుపాను కారణంగా 95కు పైగా రైళ్లు రద్దయ్యాయి.
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం...
Jawad cyclone effect in Andhra pradesh : సహాయ కార్యకలాపాల కోసం జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) అప్రమత్తమైంది. 64 సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ డీజీ అతుల్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు 46 బృందాలను పంపామని, మరో 18 బృందాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు.
అత్యంత భారీ వర్షాలు...
విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద విలేకర్లతో మాట్లాడుతూ తీవ్ర వాయుగుండం శుక్రవారం రాత్రి తుపానుగా బలపడిందన్నారు. పశ్చిమ వాయవ్యదిశగా ప్రయాణిస్తున్న తుపాను ఉత్తరకోస్తా జిల్లాలకు దగ్గరగా రావొచ్చన్నారు. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించొచ్చని తెలిపారు. ఫలితంగా శనివారం కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీవర్షాలు పడతాయన్నారు. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి చలిగాలుల తీవ్రత పెరిగి, వర్షం కురిసింది. పాఠశాలలకు అయిదో తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ప్రజలను తరలించేందుకు 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. అత్యవసర సేవల నిమిత్తం నౌకాదళం, కోస్టుగార్డు సేవలతో పాటు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. రుషికొండ బీచ్ వద్ద సముద్రం శుక్రవారం 200 అడుగులు వెనక్కి మళ్లింది. దీంతో ఇసుక తిన్నెలు, రాళ్లు బయటపడ్డాయి. తుపాను కారణంగా విశాఖ మన్యంలోని అన్ని పర్యాటక కేంద్రాలనూ ఐదో తేదీ వరకు మూసేయాలని పాడేరు ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ ఆదేశించారు.