ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసేన.. కొంతమేరకు ప్రభావం చూపింది. భాజపాతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ ఎన్నికల బరిలో దిగింది. కానీ... ఈ రెండు పార్టీలు కలిసి అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. ఏపీలో తమ పార్టీ 320 వార్డుల్లో పోటీ చేసిందని జనసేన పేర్కొంది. 18 వార్డుల్లో విజయం సాధించింది. 10 మున్సిపాలిటీల్లో బోణీ కొట్టింది. ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ ప్రభావం ఉంటుందని భావించినా.. పెద్దగా విజయం సాధించలేదు.
మున్సిపల్ ఎన్నికల్లో.. జనసేన ప్రభావం ఎంత? - మున్సిపల్ ఎన్నికల్లో జనసేన గెలుపు వార్తలు
జనసేన పార్టీ తొలిసారి ఏపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసింది. కొన్ని చోట్ల ప్రభావం చూపింది. గుంటూరు కార్పొరేషన్లో 2 స్థానాలు సొంతం చేసుకుంది. విశాఖపట్నంలో మహా నగర పాలక సంస్థలు జనసేన నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది.
అమలాపురంలో 6 వార్డులు జనసేన గెలుచుకుంది. ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో 4 వార్డులు గెలుచుకుంది. మొత్తంగా నగరాల్లో జనసేన 224 డివిజన్లలో పోటీ చేసి 7 చోట్ల గెలుపొందింది. గుంటూరులో 2 చోట్ల, ఒంగోలు, మచిలీపట్నంలో ఒక్కో డివిజన్‌లో విజయం సాధించింది. ఏఏ స్థానాల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో పరిశీలిస్తున్నామని,పార్టీ ప్రభావంపై అంచనా వేసుకుంటామని పార్టీ నాయకులు చెబుతున్నారు.
విశాఖలో 4 స్థానాల్లో జనసేన గెలుపు
ఇక గ్రేటర్ విశాఖ మహా నగర పాలక సంస్థలో జనసేన నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది. ప్రజలు జనసేన కోరుకుంటున్నారని అందుకే ఇప్పుడు ప్రధాన పార్టీలు దీటుగా గెలిపించారని జనసేన పార్టీ అభ్యర్థి 22వ డివిజన్ విజేత పీతల మూర్తి యాదవ్ అన్నారు. రానున్న రోజుల్లో నగదు లేకుండా ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారని చెప్పడానికి తమ గెలుపు ఒక నిదర్శనమని అన్నారు. విశాఖ నగరంలో త్వరలో ఇంటి పన్ను పెంచే ఆలోచనలు అధికార పార్టీ ఉందని, ఆ సమయంలో కచ్చితంగా వ్యతిరేకించి పార్టీ గొంతు వినిపిస్తానని చెప్పారు.