Pawan Kalyan Fire On YSRCP: కులమతాలపై రాజకీయాలు చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని జనసేన అధినేత పవన్ అన్నారు. తానెప్పుడూ కులమతాల గురించి ఆలోచించనని చెప్పారు. మన దేశ సామాజిక మూల లక్షణం కులమని వ్యాఖ్యనించారు. ఏపీలోని వైఎస్సార్ జిల్లా సిద్ధవటం కౌలు రైతు భరోసా బహిరంగ సభలో పాల్గొన్న పవన్.. బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. మూడేళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో 173 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారి కుటుంబాలకు లక్ష చొప్పున మెుత్తం కోటి 73 లక్షలు అందజేశారు.
అనంతరం మాట్లాడిన పవన్.. పద్యం పుట్టిన రాయలసీమ నేలలో మద్యం ప్రవహిస్తోందని దుయ్యబట్టారు. ఇంటింటికీ చీప్ లిక్కర్ వచ్చిందని ఇక్కడి యువత చెబుతున్నారన్నారు. కౌలురైతులకు సరిగా గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉపాధి లేకుంటే చదువుకున్న యువత ఏం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. తానెప్పుడూ వ్యక్తులపై పోరాటం చేయనని.. భావాలపైనే తన పోరాటం ఉంటుందన్నారు. తానెప్పుడూ పదవి కోరుకోలేదని సమాజంలో మార్పును మాత్రమే కోరుకున్నట్లు వెల్లడించారు.
"కులమతాలపై రాజకీయాలు చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుంది. వారసత్వ రాజకీయాలకు కొంతైనా అడ్డుకట్ట వేయాలి. అన్న పట్టించుకోలేదని చెల్లెలు మరో పార్టీ పెట్టారు. రాయలసీమలోని మాదిగ, మాల కులాల గురించి ఆలోచించారా? బోయ, కురబ, పద్మశాలి, బలిజల గురించి ఆలోచించారా?. వెనుకబడిన కులాల గురించే ఎప్పుడూ ఆలోచిస్తా. రాయలసీమలోని రెడ్డి, క్షత్రియ కులాల్లోనూ పేదలున్నారు. కులం, మతం, ప్రాంతం దాటి వచ్చిన మనిషిని నేను. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ఇక్కడ యూరియా ధర పెరిగింది. పెద్ద కులాలు ఘర్షణ పడితే సమాజంలో అనేక ఇబ్బందులు వస్తాయి." -పవన్, జనసేన అధినేత