వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన అధికారం చేపట్టటం ఖాయమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వైకాపా పాలన బాగుంటే రోడ్ల మీదకు వచ్చేవాళ్లం కాదన్న పవన్.. అర్హులు అందరికీ పింఛన్లు, పోలీసులకు టీఏలు, డీఏలు అందడం లేదని వ్యాఖ్యానించారు. కొందరు రెడ్ల వల్ల ఆ సామాజికవర్గంలోని అందరికీ చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షించేవాడిని. కులాలు, మతాలకు అతీతంగా అండగా ఉంటాను. రాయలసీమ నుంచి ఎందరో యువత వలస పోతున్నారు. రాయలసీమ నుంచి ఎందరో సీఎంలు వచ్చినా ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి కాలేదు. భయపెడితే పరిశ్రమలు ఎక్కణ్నుంచి వస్తాయి?. రాయలసీమకు పరిశ్రమలు రప్పిస్తా.. అభివృద్ధి చేస్తా. సాయిబాబా ఒక్కరే అంత పని చేస్తే.. ప్రభుత్వం ఎంత చేయాలి?. వచ్చిన కియా పరిశ్రమను కూడా బెదిరించారు. నాయకుడు నిజాయతీగా ఉంటే అందరికీ అభివృద్ధి ఫలాలు వస్తాయి.
-పవన్ కల్యాణ్, జనసేన అధినేత.
ప్రజాస్వామ్యంలో భయానికి చోటు లేదు..
రాయలసీమ.. పోరాటాలు, పౌరుషాల గడ్డ అని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. రాయలసీమ చదువుల సీమ అని, కానీ.. ఇప్పటికీ ఈ ప్రాంతం వెనకబడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అనే ఆయుధాన్ని ప్రజలు వాడుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రజాస్వామ్యంలో భయానికి చోటు లేదన్న పవన్.. రాయలసీమలో జనసేన మార్పు తీసుకొచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. తాము వస్తున్నామని తెలిసి పుట్టపర్తిలో 5 రోజుల్లో రోడ్లు వేశారని పవన్ వ్యాఖ్యానించారు. మనం భయపడినా కొద్దీ ఎదుటి వారు భయపెడుతూనే ఉంటారన్న పవన్.. ఎదురుతిరిగితే వారే దారికొస్తారని సూచించారు.