తెలంగాణ

telangana

ETV Bharat / city

'జనసైనికులు చెప్తేగానీ రోడ్లపై సర్కారు స్పందించదా?'

రాష్ట్రంలో రహదారులపై జనసేన శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తే తప్ప ఏపీ ప్రభుత్వం కళ్ళు తెరచి రోడ్లపై ఆలోచన మొదలుపెట్టలేని దుస్థితిలో ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.

pk
pk

By

Published : Sep 7, 2021, 3:39 PM IST

రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని జనసేన శ్రేణులు ఏకబిగిన సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తే తప్ప వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరచి రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై ఆలోచన మొదలుపెట్టలేని పరిస్థితిలో ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. లక్షల మంది రహదారి కష్టాలను చెప్పారని.. వర్షాలు తగ్గాక అక్టోబర్ తరవాత రోడ్డు మరమ్మతుల ప్రక్రియ మొదలుపెడతామని వైసీపీ ప్రభుత్వం చెప్పడం వారి చిత్తశుద్ధిని తెలుపుతోందన్నారు. ఇలా అయితే టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను నిర్ణయించి పనులు మొదలుపెట్టాలంటే సంక్రాంతి వస్తుందని.. ఇక పనులెప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు. అలా అయితే ఇంకెంత కాలం ప్రజలకు గోతుల రోడ్లు గతికావచ్చునో అర్థం చేసుకోవాలని.. ఇప్పటి వరకూ రోడ్లపై ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. నిజంగా శ్రద్ధ ఉంటే వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసేవారని పవన్ అన్నారు.

ప్రతి జనసేన నాయకుడు, జన సైనికుడు తమ పరిధిలోని రోడ్లకు సంబంధించిన అన్ని వివరాలను క్రోడీకరించుకొని సిద్ధం చేసుకోవాలని పవన్ సూచించారు. ఏ రోడ్డు ఎన్ని కిలోమీటర్ల మేర దెబ్బ తిని ఉంది, మరమ్మతులతో బాగు చేయవచ్చా, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా లాంటి వివరాలను సేకరించాలన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అక్టోబర్ తరవాత తమతమ పరిధిలోని రోడ్డుకు మోక్షం కలుగుతుందో లేదో చూసేందుకు, అభివృద్ధి చేయాల్సిన రోడ్డును మరమ్మతులతో సరిపెట్టిన పక్షంలో ప్రశ్నించేందుకు ఈ వివరాలు అవసరమన్నారు. జనసేన నాయకులు, శ్రేణులు సిద్ధం చేసే ఈ వివరాలతో ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన పార్టీ గళమెత్తుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details