PAWAN COMMENTS ON YSRCP: ఏపీలోని విశాఖలో తనను రెచ్చగొట్టి.. గొడవ జరిగేలా చేయాలని చూశారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. విశాఖ నుంచి విజయవాడ చేరుకున్న అనంతరం.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాట్లాడిన పవన్.. తనను ఎంత రెచ్చగొట్టినా సంయమనంతో వ్యవహరించానన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు క్రిమినల్స్‌కు సెల్యూట్ చేసే వ్యవస్థ ఉండడం దారుణమన్నారు. రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండకూడదనేది తన ఆశయమన్న పవన్.. వైకాపా నుంచి ఆంధ్రప్రదేశ్‌ను విముక్తి చేయటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైకాపా విముక్తి కోసం వచ్చే ఎన్నికల్లో పోరాడతామని తెలిపారు.
రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదనేదే వైకాపా ఉద్దేశమని పవన్ అన్నారు. విశాఖ గర్జన ప్రకటించిన తర్వాతే మేం జనవాణి ప్రకటించామనడం సరికాదన్నారు. వైకాపా కార్యక్రమానికి ఇబ్బంది కలిగించాలనడం మా ఉద్దేశం కాదని తెలిపారు. ఇతర పార్టీలను భయపెట్టి అదుపులో ఉంచాలనుకోవడం.. వైకాపా వ్యూహమని పవన్ విమర్శించారు.
అధికార పార్టీ గర్జించడమేంటి:పార్టీ సంస్థాగత నిర్మాణం కోసమే పర్యటనలు చేస్తున్నామన్న పవన్.. అధికార పార్టీ గర్జించడమేంటని ప్రశ్నించారు. మంత్రుల కార్లపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏమయ్యారన్నారు. విమానాశ్రయంలో కోడికత్తి ఘటనపై ఇప్పటికీ చర్యలు లేవన్నారు. వైకాపా శ్రేణులు దాడులు చేస్తున్నా పోలీసు కేసులు ఉండవని.. వాళ్లు దాడులు చేస్తే.. భావ ప్రకటన స్వేచ్ఛ అని డీజీపీ సమర్థిస్తుంటారని జనసేనాని అన్నారు.