తెలంగాణ

telangana

ETV Bharat / city

అప్పుల్లో కూరుకుపోయిన రైతులను రక్షించాల్సింది ప్రభుత్వమే: పవన్‌

Pawan Kalyan: ఏపీలో రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు విషాదకరమని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. ఈ రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన పరిహారాన్ని తక్షణమే అందించాలని డిమాండ్‌ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పుల్లో కూరుకుపోయిన రైతులను రక్షించాల్సింది ప్రభుత్వమే: పవన్‌
అప్పుల్లో కూరుకుపోయిన రైతులను రక్షించాల్సింది ప్రభుత్వమే: పవన్‌

By

Published : Apr 19, 2022, 3:03 PM IST

Pawan Kalyan: ఏపీలో నిత్యం ఏదోఒక ప్రాంతంలో అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత విషాదకరమని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ రైతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నపాటి కమతాలు ఉన్నా ప్రధానంగా కౌలు వ్యవసాయంపై ఆధారపడిన ఈ రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన పరిహారాన్ని తక్షణమే అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ బాధ్యతను నెరవేర్చాల్సిన వ్యవస్థలు, సంబంధిత అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించకూడదని కోరారు. ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం 'త్రీ మెన్ కమిటీ' సత్వరమే స్పందించాలన్నారు.

రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పని చేయాలన్న పవన్‌...ఆ విధులు నిర్వర్తించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని విమర్శించారు. వైకాపా నాయకత్వం ఎన్నికల సమయంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పంట పెట్టుబడిగా ఇస్తామని హామీ ఇచ్చిందని...ఆ మేరకు ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఎన్ని రైతు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పంట పెట్టుబడి ఇచ్చారు..? అసలు ఆ హామీ ఏమైందని నిలదీశారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. పంట అమ్ముకొన్నా సొమ్ములు చేతికి రాకపోవడం, తదుపరి పంటకు పెట్టుబడి లేక రైతులు ఇక్కట్ల పాలవుతున్నారన్నారు. కౌలు రైతులకు బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి... ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదవ వ్యక్తం చేశారు. రైతులను అప్పుల భారం నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని పవన్‌ స్పష్టం చేశారు.

"పంటకు పెట్టుబడి లేదు. రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకోరు. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించరు. పండిన పంట తీసుకొని కూడా డబ్బులు ఇవ్వరు. ఏ దశలోనూ రైతులకు వైకాపా అండగా నిలవడం లేదు" - పవన్​ కల్యాణ్​​, జనసేన అధినేత

వైకాపా ప్రభుత్వం చేసింది ఒక్కటే అన్నం పెట్టే రైతులకు కూడా కులాలవారీగా విభజించటమేనన్నారు. జనసేన పార్టీ ఇప్పటికే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకొనే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న కౌలు రైతుల ఆత్మహత్యల ఘటనల్లో ప్రతి ఒక్కరికీ రూ.7 లక్షల పరిహారం అందేలా పోరాడుతుందన్నారు. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పక్షాన భరోసా కల్పిస్తామని పవన్‌ హామీ ఇచ్చారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details