తెలంగాణ

telangana

ETV Bharat / city

PAWAN KALYAN: 'భయమంటే ఎలా ఉంటుందో.. నేను నేర్పిస్తా' - pawan kalyan news today

నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అనే సామెతను వైకాపా ప్రభుత్వం నిజం చేస్తోందని జనసేనాని పవన్‌ కల్యాణ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి గురించి ఏపీలో మాట్లాడటానికేం లేదని.. రోడ్లు వేయటానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని ఆక్షేపించారు. ప్రజలు నా వారు అనుకోబట్టే ప్రతి సన్నాసితో తిట్టించుకుంటున్నానంటూ మండిపడ్డారు.

PAWAN KALYAN
PAWAN KALYAN

By

Published : Sep 29, 2021, 5:10 PM IST

Updated : Sep 29, 2021, 9:00 PM IST

'భయం అంటే ఎలా ఉంటుందో నేను నేర్పిస్తా' అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇంట్లో వారి కారణంగా.. ఇష్టం లేకున్నా సినిమాల్లోకి వచ్చానన్న పవన్... సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనలో ఉందన్నారు. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే తాను మాట్లాడతానని, అభివృద్ధి కోసమే 2014లో తెదేపా, భాజపాకు మద్దతిచ్చానని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్​లో రోడ్లు వేయటానికీ ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని పవన్ ఆక్షేపించారు. ఏపీలో రూ.500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తున్నారని.. నిజమైన ప్రెసిడెంట్ మెడల్ రావాలంటే యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అనే సామెతను వైకాపా ప్రభుత్వం నిజం చేస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలు తన వారు అనుకోబట్టే ప్రతి సన్నాసితో తిట్టించుకున్నానని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

బెదిరిస్తే భయపడం..

ఐటీ రిటర్న్స్ వివరాల ప్రకారం జగన్ వద్ద రూ.700 కోట్లున్నాయని పవన్ తెలిపారు. వైకాపా నేతలు ఎప్పుడైనా సైనికులకు రూ.కోటి ఇచ్చారా? అని ప్రశ్నించారు. వైకాపా నేతలు బెదిరిస్తే భయపడటానికి ఇది ఇడుపులపాయ ఎస్టేట్ కాదని పవన్ అన్నారు.

'ఐటీ రిటర్న్స్‌ వివరాల ప్రకారం జగన్ వద్ద రూ.700 కోట్లున్నాయి. జగన్.. రూ.700 కోట్ల నుంచి పిల్లికి బిచ్చం పెట్టారా? నన్ను తిడితే ఏడుస్తానని వైకాపా నేతలు భ్రమపడుతున్నారు. నన్ను తిట్టేకొద్దీ నేను బలపడతాను తప్ప బలహీనపడను. నేను బలహీనపడకపోగా ఎవరినీ మరిచిపోయే ప్రశ్నే లేదు. నా అంతట నేను యుద్ధం చేయను.. నన్ను లాగితే వదలను. జానీ సినిమా ఫెయిల్‌ అయితే డబ్బులు వాపస్ ఇచ్చా. ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవటానికి ప్రభుత్వం ఎవరు. ఎవరి సొమ్ము అని పథకాలకు సొంత పేర్లు పెడుతున్నారు?. ప్రజలు ప్రతీ పనికి ప్రభుత్వానికి పన్ను కడుతున్నారు. ఓటేసిన వారికే పథకాలు పంచుతాను.. అనే వైఖరి తప్పు. నచ్చిన వాళ్లకే రేషన్‌, పింఛన్‌ ఇస్తామంటే అడగకుండా ఉంటామా?. కోడి కత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నే లేదు. మీ బాంబుల ముఠాలకు భయపడను. నా జోలికి వస్తే తోలు తీస్తానని వైకాపా వాళ్లకు చెప్పాను. నాకేమైనా థియేటర్లు ఉన్నాయా?. కాకినాడ, నెల్లూరులో మీ నాయకులకే థియేటర్లున్నాయి.'

-పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత

యుద్ధానికి సిద్ధం..

వైకాపా గ్రామ సింహాల గోంకారాలు, జనసైనికుల సింహ గర్జనలు సహజమని పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గోంకారం అంటే మొరుగుట.. గ్రామ సింహాలంటే శునకాలంటూ జనసేనాని వివరించారు. కోడి కత్తి కేసు గురించి అడిగితే వైకాపా స్పందించిన తీరు దుర్మార్గంగా ఉందని పవన్​ వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసు గురించి అడిగితే ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. వైకాపా అధినేత కూడా తన వ్యక్తిగతం గురించి మాట్లాడారన్న పవన్‌... తన తలిదండ్రులు సంస్కారం నేర్పారని, వైకాపా వారిలా తాను మాట్లాడట్లేదన్నారు. వైకాపా నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. వైకాపా నేతలకు ఏ పద్ధతిలో కావాలంటే అలానే యుద్ధం చేస్తానన్న పవన్‌... ప్రజాస్వామ్యబద్ధంగా అయినా, వేరే విధంగా అయినా యుద్ధానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదు..

జీతాలు, పింఛన్లు సకాలంలో ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. నేరుగా రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదని, ప్రజారాజ్యం పార్టీ వేళ తన అన్నయ్య చిరంజీవికి అండగా ఉండాలనుకున్నానని వ్యాఖ్యానించారు. 2014లో తెదేపాకు మద్దతు ఇచ్చినా... ఆ ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ కార్యాలయం కోసం స్థలం ఇవ్వాలని అడగలేదని వెల్లడించారు. తాను ఇచ్చేవాడినే కానీ తీసుకునే వాడిని కానని స్పష్టం చేశారు. జనం కోసం పౌరుషాన్ని తగ్గించుకుంటున్నానని వివరించారు.

'వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఆడపడుచులను తిట్టిస్తారా?. వైకాపా నాయకులకు ఆడబిడ్డల్లేరా? ఇంట్లో ఆడపడుచులు లేరా?. నేను కోట్లు ట్యాక్స్‌ కట్టే సినీరంగం నుంచి వచ్చిన వాడిని. 2014లో చంద్రబాబు నా ఆఫీస్‌కు వచ్చారు. చంద్రబాబును రమ్మనటానికి కారణం మాకు గౌరవం కోరుకోవటమే. నా ఆత్మాభిమానంపై దెబ్బకొడితే అంతే గట్టిగా బదులిస్తా. జగన్ ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించిన రోజే.. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని ఆనాడే వైకాపా వాళ్లకు చెప్పా. వైకాపా సర్కార్ అమ్మే మద్యంలో మామూళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి. వైకాపా వద్ద కిరాయి ముఠాలు ఎన్ని ఉన్నా భయపడను. భగత్​సింగ్, బోస్, గాంధీలకు తలవంచుతా. వైకాపా నాయకుల తాట తీస్తాను తప్ప.. తల వంచను.'

-పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత

అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా..

తనను గెలిపిస్తే... అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని పవన్​ చెప్పారు. ఆడబిడ్డ వైపు చూడాలంటే భయపడేలా శాంతిభద్రతలు కాపాడతానని జనసేనాని స్పష్టం చేశారు. ఏ కులాన్నైనా అకారణంగా ద్వేషించడం చాలా తప్పన్న పవన్... కాపు ఉద్యమంలో వైకాపా వారే చొరబడి అలజడి సృష్టించారని ఆరోపించారు.

'నన్ను కాపులతోనే కాదు అన్ని కులాలతో తిట్టించండి. ఏ కులం నూరు శాతం ఎవరితోనూ ఉంటుందని అనుకోను. కాపులు నాతో ఉంటే కాకినాడలో ద్వారంపూడి నన్నెలా తిట్టగలిగేవారు?. రంగా సభకొచ్చిన జనాలు ఆయన పక్కన ఉండి ఎందుకు రక్షించుకోలేదు?. ప్రాణహాని ఉందన్న.. రంగా పక్కన ఎందుకు అందరూ ఉండలేదు?. తుని రైలు ఘటనప్పుడు వైకాపా వర్గాలు అల్లర్లు రేపాయని సమాచారం. రాయలసీమలో ఎస్సీల హక్కులు కాలరాస్తున్నారు. కులాల తగాదాలతో ఏపీ అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం తగలబెట్టేస్తోంది. నేనెప్పుడూ డబ్బు వెంట పడలేదు. కులాల ఐక్యత అనే మాట నేను ఎప్పుడో చెప్పాను. 151 సీట్లు గెలిచిన పార్టీ.. అందరినీ చంపేద్దామనుకుంటే ఎలా?. అందరినీ భయభ్రాంతులను చేసి పాలించడం సాధ్యమేనా?. ఒక కులాన్ని నిర్మూలించాలని వైకాపా చేసే ప్రయత్నాలు సాగవు. ప్రజాస్వామ్యంలో వైకాపా దౌర్జన్యాలు సాగనే సాగవు. కులాల ఐక్యత అనేది ఏపీ ప్రజలకు తక్షణ ఆవశ్యకం.'

-పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత

ఇదీచూడండి:'పవన్​కల్యాణ్​ను 'పవర్​స్టార్' చేసింది నేనే'

Last Updated : Sep 29, 2021, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details