Pawan Kalyan: భాజపా, జనసేన మధ్య సమన్వయం లేదనుకోనవసరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నాయకులం అంతర్గతంగా మాట్లాడుకుంటూనే ఉన్నామని స్పష్టం చేశారు. భాజపా నుంచి జనసేన ఎలాంటి రోడ్డు మ్యాప్ తీసుకోలేదన్నారు. తాము కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఎలా ముందుకు వెళ్లాలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన విలేకరులతో ముచ్చటించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆయన వెంట ఉన్నారు. వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు పవన్‌కల్యాణ్ స్పందించారు.
"హింసను ప్రేరేపించే ఏ ప్రభుత్వాన్నీ ప్రజలు ఇష్టపడరు. ఓట్లు వేయరు. ఉభయగోదావరి జిల్లాల్లో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. కోనసీమ అల్లర్లు కావాలనే చేశారని నాకు అనిపిస్తోంది. కేంద్ర నిఘావర్గాలు ముందే హెచ్చరించినా పోలీసులు పట్టించుకోపోవడం, ముఖ్యమంత్రి ఇంతవరకు దీనిపై స్పందించకపోవడం, డీజీపీ కూడా పట్టించుకోకపోవడం.. మంత్రులు ఎవరూ అక్కడికి వెళ్లకపోవడం చూస్తోంటే అదే అనిపిస్తోంది. డీజీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు." - పవన్‌కల్యాణ్
కోనసీమ తగలబడుతుంటే యాత్రలా? : "ఒక సమస్యను మళ్లించడానికి మరో సమస్య. ఒక రాజధాని నిర్మించలేకపోతే మూడు రాజధానులు. దానిపై రగడ.. పక్కదోవ పట్టించడం, ఎమ్మెల్సీ అనంత్‌బాబు విషయాన్ని పక్కకు మళ్లించడానికి కోనసీమ అల్లర్లు. కోనసీమలో అంబేడ్కర్‌పై గౌరవం లేక కాదు. ఇది వారి పార్టీలో రెండు గ్రూపుల మధ్య వివాదం. బహుజన సిద్ధాంతానికి వ్యతిరేకంగా పన్నిన పన్నాగంలా అర్థమవుతోంది. ఇదంతా కావాలని చేసినట్లుగా అనిపిస్తోంది. ఒకవైపు కోనసీమ తగలబడుతోంటే బస్సు యాత్రలు చేస్తారా? ఈ ఘటనలు ఏదో ఒక పార్టీకి మైనస్ కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు మైనస్. దీన్ని ఎవరైనా తమకు అనుకూలంగా, ప్లస్‌గా తీసుకుంటే వారు సమాజహితం కోరుకునే వారు కాదు. ఒకవేళ జనసేన వారే ఇందులో ఉంటే అరెస్టు చేయండి. ఆస్తుల విధ్వంసానికి బాధ్యుల నుంచి రికవరీ చేయించాలనే ఆలోచన మంచిదే. ముందు వైకాపా వారిని ఇందుకు బాధ్యులను చేయాలి. ఇప్పటికే వైకాపా కాపులను, బీసీలను, మత్స్యకారులను, కమ్మవారిని వర్గ శత్రువులుగా ప్రకటించింది. చివరికి వారికి ఇతరులెవరూ మిగలరు. శివసేన అధికార ప్రతినిధి మాట్లాడుతూ కోనసీమ అల్లర్లలో మోదీ ప్రమేయం ఉందని అన్నారు. ఇందులో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు. మోదీకి ఏ సంబంధం లేదు. వైకాపా తప్పులు చేసి కేంద్ర ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తోంది." అని పవన్ కల్యాణ్ అన్నారు.