Mla Jakkampudi Raja: ఆంధ్రప్రదేశ్లో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసన సెగ తగిలింది. వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రూ.2వేలు ఎటూ చాలదని.. రూ.10వేల చొప్పున ఇవ్వాలనే డిమాండుతో సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని జనసేన నిర్ణయించింది. ముఖ్యమంత్రి పర్యటించే పి.గన్నవరం మండలం జి.పెదపూడి వద్దకు జనసేన వీర మహిళలు చేరుకోవాలని ప్రయత్నించినా పోలీసుల ఆంక్షలతో కుదరలేదు.
ఆ సమయంలో అటువైపు వస్తున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వాహనాన్ని వారు అడ్డుకుని నిరసన తెలిపారు. వాహనం దిగిన ఎమ్మెల్యే.. మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో వైకాపా డౌన్ డౌన్.. సీఎం డౌన్ డౌన్.. అంటూ మహిళలు నినాదాలు చేశారు. అసహనానికి గురైన ఎమ్మెల్యే జక్కంపూడి పిచ్చిపిచ్చి వేషాలు వెయ్యొద్దంటూ వారిని హెచ్చరించారు. పోలీసులు జోక్యం చేసుకుని అడ్డుతొలగించే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురు మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.