హైదరాబాద్‌లో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మాట్లాడిన పవన్.... తెలంగాణ భాజపాపై విమర్శలు చేశారు. జనసేనను తెలంగాణ భాజపా నాయకత్వం అంగీకరించలేకపోతోందని.... రాష్ట్ర నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. గౌరవం లేని చోట స్నేహం చేయాలని కోరుకోవట్లేదని పవన్ స్పష్టం చేశారు. ఖమ్మం ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు బలమైన పోటీ ఇస్తారని స్పష్టం చేశారు. అణగారిన వర్గాలు, బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచే బలంగా ముందుకెళతామని పవన్ స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కులం ప్రాతిపదికన రాజకీయాలు జరగడం దురదృష్టకరమన్నారు. సమతుల్యతతో కూడిన బహుజన విధానమే జనసేన ఆకాంక్షఅని పవన్ వివరించారు.
నేతల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా..
రాష్ట్ర విభజన సమయంలో భాజపా మద్దతు తెలిపింది. ఏపీకి మోదీ మద్దతు ఇచ్చినందుకే భాజపాతో పొత్తు పెట్టుకున్నాం. భూ సంస్కరణలు తెచ్చి పీవీ సీఎం స్థానం పోగొట్టుకున్నారు. పీవీ చితి కాలకుండా అగౌరవపరిచారు. విభజన అన్యాయంతో ఏపీ ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జన సైనికులు నిలబడిన విధానం హర్షణీయం. తెలంగాణ నాయకత్వం జనసేనను అంగీకరించలేకపోతోంది. భాజపా నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. కేంద్రంతో సత్సంబధాలు ఉన్నాయి. తెలంగాణలో మంచి సంబంధం లేదని జనసేన నేతలు బాధపడ్డారు. తమ మనోభావాలు దెబ్బతీయొద్దని తెలంగాణ జనసైనికులు కోరారు. గౌరవం ఇవ్వకపోవడంపై జనసేన నేతలు బాధపడుతున్నారు. పీవీ కుమార్తెకు మద్దతు తెలుపుదామని జనసైనికులు స్పష్టం చేశారు. పీవీ కుమార్తెకు మద్దతు ఇవ్వాలన్న నేతల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా. గౌరవం లేనిచోట స్నేహం చేయాలని కోరుకోవట్లేదు - పవన్ కల్యాణ్, జనసేన అధినేత.
ఇవీ చూడండి:స్వయం సమృద్ధి దిశగా.. ఉద్యాన శాఖ అడుగులు