జలమండలి పరిధిలోని సీజీఎం, జీఎంలు తమకు నిర్దేశించిన రెవెన్యూ లక్ష్యాలు పూర్తి చేసి... ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఎండీ దాన కిషోర్ ఆదేశించారు. మొండిబకాయిల వసూళ్లు, బిల్లులు చెల్లించని కనెక్షన్ల తొలగింపునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ వీడీఎస్-2019, సెవరేజీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్రమ నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించడం కోసం డీజీఎంలు తమ పరిధిలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.
వచ్చే ఫిబ్రవరి వరకు అమలులో వీడీఎస్-2019
వీడీఎస్-2019 ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా 2300 అక్రమ నల్లా కనెక్షన్‌దారుల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. త్వరలోనే వీరికి క్యాన్ నెంబర్లు కేటాయిస్తామని వివరించారు. వీడీఎస్-2019 వచ్చే ఫిబ్రవరి 21 వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున జరిమానాలు, క్రిమినల్ కేసుల బారిన పడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ఎండీ కోరారు. ఒకేసారి కనెక్షన్ ఛార్జీల రూపంలో సుమారు రూ. 9.3 కోట్లు, ప్రతీ నెల నల్లా బిల్లుల ద్వారా దాదాపు రూ.22 లక్షల ఆదాయం సమకూరుతుందని వివరించారు. పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో సెవరెజీ ఓవర్ ఫ్లోలు, మంచినీటి లీకేజీలు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.