Jagga Reddy Comments On Revanth: క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ... పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించకుండా.. పార్టీ కార్యక్రమాలపై ప్రకటనలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా కమిటీ ముందుకు పిలవాలని... అప్పుడే తాను కమిటీ ముందు హాజరవుతానని స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం... అనంతరం ఛైర్మన్ చిన్నారెడ్డి మీడియాకు పలు విషయాలు వెల్లడించడంపై జగ్గారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
సోనియాగాంధీకి తాను రాసిన లేఖ మీడియాకు ఎలా లీక్ అయ్యిందో తనకు తెలియదన్న విషయమై.. వివరణ కూడా ఇచ్చినట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తన లేఖపై క్రమశిక్షణ కమిటీకి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా..? లేదా మీడియాలో వచ్చిన వార్తలను కమిటీ సుమోటోగా తీసుకుందా..? అన్న విషయాన్ని చిన్నారెడ్డి ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. పార్టీ లైన్ దాటి జరుగుతున్న ఎన్నో అంశాలు క్రమశిక్షణ పరిధిలోకి రావా..? అని నిలదీశారు.