తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుత్‌ కోతలకు విధానాలే కారణం... ముందుకు రాని పెట్టుబడిదారులు

ఏపీలో అస్తవ్యస్థ విద్యుత్‌ కోతలకు వైకాపా ప్రభుత్వ ప్రణాళికలే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. 2019 తర్వాత ఒక్క మెగావాట్ అదనంగా ఉత్పత్తి చేయలేదన్న విద్యుత్‌ సంస్థల గణాంకాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2014-19 మధ్య దాదాపుగా 8వేల మెగావాట్లు అందుబాటులోకి రాగా... 2019 తర్వాత ఒక్క ప్రాజెక్టూ ప్రారంభం కాలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం వద్దని చెప్పినా వినకుండా గత ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏలను సమీక్షిస్తామని ప్రకటించడంతో...పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో పరిస్థితి దిగజారి ప్రస్తుత కరెంట్‌ కోతల సంక్షోభం తలెత్తింది.

Power supply
విద్యుత్‌ సరఫరా

By

Published : Apr 10, 2022, 10:31 AM IST

Jagan policies responsible for power cuts: 2014 జూన్‌ 2న రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. ఏపీలో డిమాండుకు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి లేక సర్దుబాటు కోసం రోజూ 15 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) కోతలు పెట్టేవాళ్లు. అయిదు నెలల్లో విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా అప్పటి ప్రభుత్వం తీర్చిదిద్దింది. గతంలో తెదేపా హయాంలో 2014 నుంచి 2019 మధ్య 8వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది. కానీ, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటివరకూ కొత్తగా ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యుత్‌రంగ పరిస్థితి దిగజారి 2014 ప్రారంభంలో మాదిరే కోతలు విధించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది.

విభజన నాటికి విద్యుత్‌ డిమాండు సమారు 139 ఎంయూలుగా ఉంటే.. 124 ఎంయూలే అందుబాటులో ఉండేది. దీంతో అప్పట్లో రోజూ 15 ఎంయూలను లోడ్‌ రిలీఫ్‌ పేరిట డిస్కంలు కోత విధించి సర్దుబాటు చేశాయి. అప్పట్లో పునరుత్పాదక విద్యుత్‌ 3.19 ఎంయూలు మాత్రమే. రాష్ట్ర విభజన నాటికి పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి 500 మెగావాట్లే వచ్చేది. 2015 నుంచి అప్పటి ప్రభుత్వం పవన, సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించింది. దీంతో పునరుత్పాదక విద్యుత్‌ 12.11 ఎంయూలకు పెరిగింది. 2019 నాటికి పవన విద్యుత్‌ 4,179 మెగావాట్లు, సౌర విద్యుత్‌ 2,882 మెగావాట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా సీజన్‌లో సుమారు 50-60 ఎంయూల విద్యుత్‌ వచ్చే అవకాశం ఏర్పడింది. దీనివల్ల రాష్ట్ర విద్యుత్‌ డిమాండు 191 ఎంయూలకు చేరినా కోతలు విధించాల్సిన అవసరం రాలేదు.

సౌర విద్యుత్తులో ఎదురుదెబ్బలు

ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపైనా భారీ విమర్శలు వచ్చాయి. వ్యసాయానికి ఉచిత విద్యుత్‌ అందించడానికి 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఏపీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏపీజీఈఎల్‌) అనే సంస్థను ఏర్పాటుచేసింది. ప్లాంట్ల ఏర్పాటుకు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 50 వేల ఎకరాలను సంస్థ గుర్తించింది. మొదటి విడతగా 6,400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 2020 ఆగస్టులో ఏపీజీఈఎల్‌ టెండర్లను పిలిచింది. సాంకేతిక బిడ్‌ల పరిశీలన తర్వాత 2021 ఫిబ్రవరి మొదటి వారంలో ప్రైస్‌ బిడ్‌లను ఏపీజీఈఎల్‌ తెరిచింది. ఎన్‌టీపీసీ 600 మెగావాట్లు, టొరెంటో పవర్స్‌ లిమిటెడ్‌, హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌లు ఒక్కొక్కటీ 300 మెగావాట్లు.. మిగిలిన 5,200 మెగావాట్లకు అదానీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ బిడ్‌లు దాఖలు చేశాయి.

కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ మార్గదర్శకాల మేరకు టెండరు డాక్యుమెంటు లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ టాటా రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ధర్మాసనం టెండర్లను నిబంధనల మేరకు నిర్వహించలేదని.. కొందరికి ప్రయోజనం కలిగించే ఉద్దేశం కనిపించిందంటూ ప్రక్రియను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ బిడ్‌లలో కోట్‌ చేసిన యూనిట్‌ ధర రూ.2.49 వరకు ఉంది. ఈ టెండర్ల ఆధారంగా వచ్చిన ధర ప్రకారం 7వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తామని 2021 సెప్టెంబరు 15న సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) ప్రభుత్వానికి లేఖ రాసింది. 2019లో నిర్వహించిన టెండర్ల ఆధారంగా 7 వేల మెగావాట్లను యూనిట్‌ రూ.2.49 వంతున (ట్రేడ్‌ మార్జిన్‌ కలిపి) ఇవ్వనున్నట్లు లేఖ రాసింది.

2024 సెప్టెంబరులో 3వేలు, 2025లో 3వేలు, 2026లో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఇచ్చేలా సెకి ప్రతిపాదించింది. ప్రస్తుతం మార్కెట్‌లో సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.1.99 ఉంది. మార్కెట్‌లో సౌర విద్యుత్‌ ధరలు వేగంగా తగ్గుతుంటే.. ప్రభుత్వం మాత్రం మూడు నుంచి అయిదేళ్లకు ముందే విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో యూనిట్‌ రూ.2.49 వంతున కొనేందుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల పీపీఏ వ్యవధి 25 ఏళ్లలో సుమారు రూ.21,250 కోట్ల భారం రాష్ట్రంపై పడుతుందని అంచనా. 2019 నవంబరులో పిలిచిన బిడ్‌లలో కోట్‌ చేసిన ధరల ప్రకారం ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదనపై భారీగా విమర్శలు వచ్చాయి. రాబోయే రెండేళ్లలో సౌర విద్యుత్‌ ధరలు భారీగా తగ్గి యూనిట్‌ రూ.1.50 వరకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

మూడేళ్లలో ఒక్క పీపీఏ లేదు.. ఉన్నవాటినీ ఇబ్బంది పెట్టారు..

వైకాపా అధికారం చేపట్టిన తర్వాత మూడేళ్లలో ఒక్క సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకూ ఒప్పందం కుదుర్చుకోలేదు. పైపెచ్చు తెదేపా హయాంలో ఏర్పాటైన పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న 264 పీపీఏల యూనిట్‌ ధర ఎక్కువని.. వాటిని సమీక్షిస్తామని ప్రకటించి వివాదాన్ని రేపింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని కేంద్రం హెచ్చరించినా పట్టించుకోలేదు. పీపీఏలపై సమీక్షకు ఉన్నతస్థాయి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ విషయమై కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ జోక్యం చేసుకుని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ వివాదంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అదనంగా ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులూ రాలేదు.

ఇదీ చదవండి:జంటనగరాల్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలు మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details