తెలంగాణ

telangana

ETV Bharat / city

JAGAN CASE: 'సీబీఐ కేసులతో సంబంధం లేకుండా విచారించొచ్చు' - జగన్ కేసు విచారణ వార్తలు

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీబీఐ కేసుల తరువాతే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులపై విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌లపై శుక్రవారం ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.

JAGAN CASE
JAGAN CASE

By

Published : Jul 24, 2021, 9:34 AM IST

ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసుల తరువాతే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులపై విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌లపై శుక్రవారం ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులపై విచారణ చేపట్టవచ్చంటూ సీబీఐ/ఈడీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నిందితులు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌, కార్మెల్‌ ఏసియాహోల్డింగ్స్‌, భారతి సిమెంట్స్‌ దాఖలు చేసిన పలు పిటిషన్‌లపై శుక్రవారం జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ విచారణ చేపట్టారు.

ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘క్రిమినల్‌ కేసుల్లో నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉంటుంది. అదే మనీలాండరింగ్‌ కేసుల్లో సొమ్ము తమదేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితులపైనే ఉంటుంది. ఈడీ చట్టంలోని సెక్షన్‌ 44కు వివరణ ఇస్తూ 2019లో చట్ట సవరణ వచ్చింది. దీని ప్రకారం ప్రధాన కేసు (క్రిమినల్‌)తో సంబంధం లేకుండా ఈడీ కేసుపై విచారణ చేపట్టవచ్చు. ఒకవేళ క్రిమినల్‌ కేసును కొట్టివేసినా, మరే రకమైన ఉత్తర్వులు జారీ చేసినా ఈడీ కేసుపై విచారణను కొనసాగించవచ్చు. ఇది స్వతంత్రమైనది. మరో కేసుతో సంబంధం లేదు. ఈడీ కేసును నమోదు చేయడానికి క్రిమినల్‌ కేసును పరిగణనలోకి తీసుకుంటారు. క్రిమినల్‌ కేసు నమోదైతేనే దాని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేస్తారు. మద్రాసు, బాంబే హైకోర్టులు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. పిటిషనర్లు తమకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్న తీర్పులు సవరణకు ముందు వచ్చాయి. అందువల్ల ఈ పిటిషన్‌లను కొట్టివేయాలని’ కోరారు. అంతకుముందు సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

హెటిరో కేసులో స్టే పొడిగింపు

తమపై కేసు కొట్టివేయాలంటూ హెటిరో గ్రూపు కంపెనీలు, ఎండీ శ్రీనివాసరెడ్డిలతో పాటు ఇండియా సిమెంట్స్‌, ఎంబసీ రియల్టర్లు దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణ నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం హైకోర్టు మరో మూడు వారాలపాటు పొడిగించింది. దీంతోపాటు ఈడీ కేసును కొట్టివేయాలంటూ ఇండియా సిమెంట్స్‌, దాని ఎండీ ఎన్‌.శ్రీనివాసన్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లలోనూ మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తూ విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details