రాష్ట్ర హైకోర్టులో ఇవాళ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపించింది. పెట్టుబడుల రూపంలో ముడుపుల వసూళ్లకు జగన్ కుట్ర చేశారని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. తండ్రి అధికారంతో లబ్ధి చేకూర్చి.. వారి నుంచి ముడుపులకు కుట్ర చేశారంది.
ముడుపుల రూపంలో పెట్టుబడుల సేకరణలో ఏపీ సీఎం జగన్, విజయసాయి కీలక పాత్ర పోషించారని న్యాయస్థానానికి సీబీఐ వివరించింది. జగతి పబ్లికేషన్స్‌లో రూ.1246 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. రూపాయి పెట్టకుండానే జగన్ రూ.1246 కోట్ల పెట్టుబడులు రాబట్టారని తెలిపింది. భూకేటాయింపులు, పెట్టుబడులను కలిపి చూస్తే కుట్ర కోణం తెలుస్తుందని.., భూకేటాయింపుల ఫైలు కదిలిక మేరకు పెట్టుబడులు వెళ్లాయని కోర్టుకు తెలియజేసింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయని వెల్లడించింది. వాదనలు విన్న న్యాయస్థానం శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన పలు వ్యాజ్యాలపై హైకోర్టు రోజువారీ విచారణలో భాగంగా.. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇవాళ హెటిరో, ఆ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపారు. సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది కె.సురేందర్ వాదనలు వినిపించారు.