సీత తండ్రి శ్రీరాం తూర్పు గోదావరిజిల్లాలోని రామచంద్రాపురం వాసి. ఆంధ్రయూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివిన ఆయన తర్వాత కాలంలో అమెరికాలో స్థిరపడ్డారు. తల్లి శారదా శొంఠి ప్రొఫెసర్. సీత అక్కడే జన్మించారు. తెలుగుని అమితంగా ప్రేమించే సీత పదిభాషలని అనర్గళంగా మాట్లాడటమే కాదు.. నాట్యం, సంగీతంలో సైతం ప్రతిభావంతురాలు. సోదరితో కలసి శొంఠి సిస్టర్స్ పేరుతో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. చిన్నవయసులోనే ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా తరఫున బాగ్ధాద్‌లో పనిచేసిన సీత... సుమారు పది దేశాల్లో అమెరికా ప్రతినిధిగా పనిచేసి ప్రస్తుతం స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం అంతరిక్ష పరిశోధనల్లో సంచలనాలకి తెరతీసింది స్పేస్ ఎక్స్ సంస్థ. దాని ప్రధాన వ్యూహకర్తల్లో సీత శొంఠి ఒకరు. ఈ సంస్థ తొలిసారిగా నాసా నుంచి నలుగురు వ్యోమగాములని ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో క్రూడ్రాగన్ అనే హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్‌ని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లోకి పంపింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మిషన్‌హెడ్‌గా వ్యవహరించారీమె. ఇదే స్ఫూర్తితో మరికొన్ని కీలకమైన అంతరిక్ష ప్రయోగాలూ జరుగుతున్నాయి.
అమెరికా వైమానికదళంలో ‘45స్పేస్‌వింగ్’ విభాగానికి ఓ ప్రత్యేకత ఉంది. అంతరిక్ష ప్రయోగాలు చేసేటప్పుడు వాతావరణం అంతా బాగానే ఉందని ఈ సంస్థ పచ్చజెండా ఊపితేనే... రాకెట్లని అంతరిక్షంలోకి పంపిస్తారు. ఈసారి స్పేస్‌ఎక్స్ అంతరిక్ష సంస్థ పంపిన రాకెట్ లాంచింగ్‌కి పచ్చజెండా ఊపింది ఓ ‘ఆల్‌ఉమెన్’ బృందం కావడం విశేషం. వెదర్ డైరెక్టర్ కెప్టెన్ నాన్సీ జిమ్మర్‌మేన్ నేతృత్వంలో ఈ బృందం పనిచేసింది. రాకెట్లని పంపించడానికి కావాల్సిన వాతావరణ పరిస్థితులపై రిపోర్టులు ఇచ్చే బాధ్యత ఈ బృందానిదే. ఒకప్పుడు పురుషాధిక్య రంగం అనిపించుకున్న ఈ అంతరిక్ష పరిశోధన బృందంలోకి ఇలా పూర్తిగా అమ్మాయిలే వచ్చి విధులు నిర్వహించడం విశేషమే కదా!