కరోనా నేపథ్యంలో రోజుల తరబడి ఇళ్లకే పరిమితమైన పిల్లలను కట్టడి చేయడం తల్లిదండ్రులకు కష్టంగా ఉంది. చుట్టుపక్కల మిత్రులతో కలిసి ఆడుకుంటామని మారాం చేస్తుంటే కాదనలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో పిల్లలు బయటకు రావడం ప్రమాదకరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పక్కనే ఆడుకుంటామంటూ పిల్లలు బయటకు తుర్రుమంటున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. పది మంది పిల్లలు కలిస్తే ప్రమాదమనే ఆందోళనతో గడపాల్సి వస్తోందని, వాళ్లు కొద్దిగా దగ్గినా, తుమ్మినా భయం మొదలవుతోందని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులైతే పిల్లలను సంరక్షించడం మరింత ఇబ్బంది. ఉద్యోగాలకు వెళ్లక తప్పదు. పాఠశాలలు తెరవకపోవడంతో పిల్లల్ని ఎక్కడ ఉంచాలో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు.
డిజిటల్ తెరలతో ప్రమాదం
బయటకు వెళ్లవద్దంటే పిల్లలు ఇంట్లోనే టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ అలవాటు వారి వ్యక్తిత్వంపై ప్రభావం చూపవచ్చని, పాఠశాలలు మొదలైన తర్వాత కూడా వీటిని నివారించడం కష్టమని భయపడుతున్నారు. గతంలో ఎండాకాలం వస్తే పిల్లలకు ఈత, సంగీతం, నృత్యం వంటివి నేర్పించేవాడినని, ఇప్పుడు ఇంటికే పరిమితం కావడంతో వాళ్లు టీవీని వదిలిపెట్టడంలేదని హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి వెల్లడించారు.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
- రోజూ ఇంటికి వచ్చిన వెంటనే 20 నిమిషాల పాటు పిల్లలను దగ్గరికి తీసుకుని గోముగా మాట్లాడాలి.
- పిల్లల ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుని వారికి అవసరమైన సామగ్రి సమకూర్చాలి.
- ఇంట్లో తగాదాలు, గొడవలకు పిల్లలను దూరంగా పెట్టాలి. కరోనా అంటే భయం కాకుండా ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి.
- అపార్టుమెంట్లలో ఉండే వారు పిల్లలు ఆడుకునే ప్రాంతాలను శానిటైజ్ చేయాలి. పార్కుల్లోనూ ఇదే పద్ధతి అనుసరించాలి. ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని పిల్లలు భౌతికదూరం పాటించేలా చూస్తుండాలి.
అవకాశంగా మలచుకోవాలి
ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే. దీన్ని ఒక అవకాశంగా మలచుకోవాలి. రాబోయే రోజుల్లో అయినా పిల్లలు బయటకు వెళ్లక తప్పదు కనుక కరోనా నుంచి తప్పించుకునేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై ఒకటికి పదిసార్లు శిక్షణ ఇవ్వాలి. ఈ మూడూ వారి దైనందిన జీవితంలో భాగమయ్యేలా చేయాలి. పాఠశాలలు తెరిచాక కూడా ఈ అలవాట్లు ఉపయోగపడతాయి. పిల్లల్ని వీలైనంత వరకూ ఇంట్లోనే ఉంచాలి. తల్లిదండ్రుల్లో ఒక్కరైనా వారితో ఉండేలా సర్దుబాటు చేసుకోవాలి.