హైదరాబాద్‌లో తొలి కొవిడ్ కేసు బయటపడినప్పటి నుంచి మా కంపెనీ ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశం ఇచ్చింది. కార్యాలయంలో ఉంటే తోటి ఉద్యోగులు పక్కపక్కనే ఉంటారు కాబట్టి నేరుగా మాట్లాడేవాళ్లం. ఇప్పుడు ప్రాజెక్ట్‌లో ఏ అవసరం వచ్చినా కాల్ చేయడమో, జూమ్‌లో కలుసుకోవడమో చేయాల్సి వస్తోంది. నెలల తరబడి ఇంటి నుంచి పని(వర్క్ ఫ్రం హోమ్)తో కొంత విసుగ్గా ఉంది. కార్యాలయానికి ఎప్పుడు రమ్మంటారా అని ఎదురుచూస్తున్నా.
ఇంటి నుంచి పని... ఇంకెన్నాళ్లని..! - work from home due to lockdown
వర్క్ ఫ్రం హోమ్ అంటే ఉద్యోగులు మొదట్లో ఎగిరి గంతేశారు. ఉత్పాదకత పెరగడం, మౌలిక వసతుల కల్పన వ్యయం తగ్గడంతో కంపెనీలు సైతం ఎప్పటికప్పుడు దానిని పొడిగించుకుంటూ వస్తున్నాయి. చాలా కంపెనీలు జూన్ వరకు పొడిగించాయి. మున్ముందు సైతం దాదాపు 50 శాతం వరకు ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రమ్మంటున్నాయి. పది నెలలకుపైగా ఇంటికే పరిమితం కావడం, గంటల తరబడి వర్చువల్ సమావేశాలతో ఉద్యోగులు బాగా ఒత్తిడికి గురవుతున్నారు. మహిళా ఉద్యోగులతో పోలిస్తే పురుష ఐటీ ఉద్యోగులు కార్యాలయానికి ఎప్పుడు రమ్మంటారా అని ఎదురుచూస్తున్నారు.
- ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
ఉద్యోగి పరంగా చూస్తే..
- ఇంట్లో పని వాతావరణం లేదనే భావన ఎక్కువ మందిలో ఉంది. ప్రాజెక్ట్‌లో సభ్యులందరూ కలిసి బృందంగా పనిచేసేవారు. ఒంటరిగా పనిచేయడం ఇబ్బందిగా భావిస్తున్నారు. మానసికంగా కొందరు ఇబ్బంది పడుతున్నారు.
- ఇంకొందరు సరైన కుర్చీ, బల్ల వంటి కనీస సదుపాయాలు సమకూర్చుకోక ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు పనికి ఆటంకం కల్గిస్తున్నారని ఇంకొంతమంది చెబుతున్నారు. పడక గదుల్లో బెడ్ మీద కూర్చుని పనిచేయడంతో చాలామంది వెన్ను, మెడనొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు. బయటకు వెళ్లే పనిలేక ఎక్కువ గంటలు ఇంట్లో ఉండడంతో డి విటమిన్ లోపం తలెత్తుతోంది. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయని ఐటీ ఉద్యోగులు అంటున్నారు.
ఐటీ సంస్థల ఆలోచనలు ఇలా..
- వర్క్ ఫ్రం హోం ద్వారా ఉత్పాదకత పెరగడం ప్రోత్సాహకరం.
- మామూలుగా మౌలిక వసతులకు ప్రతి ఉద్యోగిపై భారీ వ్యయం చేయాల్సి ఉంటుంది. ప్లగ్ అండ్ ప్లే తీసుకున్నా ఒక్కోసీటుపై సగటున రూ.ఐదు వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చవుతుంది. ఇప్పుడది మిగిలినట్లే.
- ప్రస్తుత పరిస్థితుల్లో క్యాబ్‌లపై అలాగే హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది, లిఫ్ట్ బాయ్‌లు తదితరులపై చేసే ఖర్చూ కొంత తగ్గుతోంది.
- ఉద్యోగులు ఎక్కువగా సెలవులు తీసుకోరు. 24 గంటలూ అందుబాటులో ఉంటారు.
విసుగు నుంచి బయట పడేందుకు..
- వర్క్ ఫ్రం హోమ్ మరికొన్నాళ్లు తప్పకపోవడంతో సానుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నవారూ లేకపోలేదు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చేస్తున్న పనిలోనే కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నారు.
- 24 గంటలూ ఇంట్లోనే కావడంతో మితంగా ఎక్కువ సార్లు ఆహారం తీసుకుంటూ రోజు మొత్తం చురుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారాంతాల్లో రెస్టారెంట్ల వైపు కదులుతున్నారు.
- కార్యాలయానికి రానుపోనూ మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రాత్రి త్వరగా నిద్రిస్తున్నారు.
- ఎక్కువసేపు కూర్చోకుండా.. మధ్యమధ్యలో పిల్లలతో ఆడుతూ... ఇంట్లోనే అటూ ఇటూ తిరుగుతూ శారీరక రుగ్మతలు రాకుండా జాగ్రత్త వహిస్తున్నారు. నిత్యం అరగంట నుంచి 40 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తున్నారు.
ఎక్కువ గంటలు లాగిన్ అయి ఉండాల్సి రావడంతో...
ఉద్యోగులు మొదట్లో వర్క్ ఫ్రం హోమ్‌తో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. సరైన నెట్ కనెక్టివిటీ లేకపోవడం, పనికి ప్రత్యేకంగా గది లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. నెలలు గడిచేసరికి ఇలాంటివన్నీ తొలగిపోయాయి. కాకపోతే ఎక్కువ గంటలు లాగిన్ అయి ఉండాల్సి రావడంతో పనిభారం పెరిగిందని భావిస్తున్నారు. కార్యాలయంలో పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు కెఫెటెరియాకు వెళ్లేవారు. నలుగురితో మాట్లాడేవారు. ఇప్పుడు సహచరులతో అలా మాట్లాడే అవకాశం కోల్పోయామని కొందరు ఉద్యోగులు భావిస్తున్నారు.
- సందీప్ మక్తాల, అధ్యక్షుడు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్