తమ ప్రాజెక్టులపై కరోనా ప్రభావం పడకుండా హైదరాబాద్‌లో ఐటీ సంస్థలు జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలో.. తొలుత పది శాతానికే పరిమితమైన ‘వర్క్ ఫ్రం హోమ్’ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 30 శాతానికి చేరింది. ఇంటినుంచి పని విధానంతో ఇప్పటికే మార్కెట్‌లో ల్యాప్‌టాప్‌ల కొరత ఏర్పడింది. ఐటీ సంస్థలకు గంపగుత్తగా అద్దెకు ఇచ్చే ధరలూ పెరిగాయి. గతంలో ల్యాప్‌టాప్‌కు నెలకు రూ.1200 వరకు ఉన్న అద్దె రూ.4 వేలకు పెరిగింది.
అందరికి కుదరదు..
ఐటీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇంటి నుంచి పని సాధ్యం కాదు. పనిచేస్తున్న కేటగిరీ, రంగాల ఆధారంగా ఈ అవకాశం ఉంటుంది. అలాగే సర్వీసు రంగాల్లోని ఉద్యోగులకు అసలు కుదరదు. టెక్నికల్ సపోర్టు ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ప్రత్యేక హక్కులు కలిగిన సాఫ్ట్‌వేర్‌ను బయటకు ఇవ్వరు. ఈ నేపథ్యంలో 100 శాతం ‘వర్క్ ఫ్రం హోం’ కుదరదని కంపెనీలు చెబుతున్నాయి.