కరోనా కట్టడి కోసం సరిగ్గా ఏడాది క్రితం ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేసింది. అవసరమైన చోట్ల కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఫలితంగా కొవిడ్ కేసులు తగ్గించేందుకు యత్నించింది. రోజుకు వేలల్లో నమోదైన కేసులు.. క్రమంగా వందలకు చేరాయి. లాక్‌డౌన్ ఎత్తివేతతోపాటు జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పాఠశాలల్ని పునఃప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వేవ్ బారినపడినా.. రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు తలెత్తకపోవడానికి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలే కారణమని అధికారులు నిన్న మొన్నటి వరకు ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు కనిపించడం చూస్తుంటే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని అధికారులే అంచనా వేస్తున్నారు. తాజాగా 412 మంది వైరస్ బారినపడ్డారని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా 417 మందికి వైరస్ సోకగా.. 2021లో మరో మారు అత్యధిక కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 700 మందికిపైగా పాఠశాల విద్యార్థులకు వైరస్ సోకిందని గుర్తించారు. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల వసతి గృహాల్లో ఉండే విద్యార్థులే అధికంగా వైరస్ బారినపడుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.
గడచిన 24 గంటల్లో 412 మందికి వైరస్ నిర్ధరణ కావటం వల్ల ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 3,03,867కి చేరింది. మరో 216 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,042కు చేరింది. మరో ముగ్గురు వైరస్‌తో మృతి చెందగా మొత్తం మరణాలు 1,674కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,151 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 1,285మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. 10 రోజుల క్రితం వరకు రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15 వందల నుంచి 2వేల లోపే ఉండగా.. ఇప్పుడది కాస్తా.. 3 వేలపైకి చేరటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా పెరిగిన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా నమోదయ్యాయి. అందులోనూ 103 మంది గ్రేటర్ పరిధిలోనివారే. రంగారెడ్డి, మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలో వారం క్రితం 30 దాటని కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతూ ఇవాళ 103కి చేరాయి. ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యారోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ రోగులకు కేటాయించిన పడకల్లో 8 వేల వరకు ఖాళీగా ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దు జిల్లాలతోపాటు.. గురుకుల వసతి గృహాల్లో గణనీయంగా కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్యను పెంచింది. లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. అపోహలకు దూరంగా ఉంటూ కొవిడ్ టీకా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించటం, భౌతికదూరం పాటించటంతోపాటు.. టీకా ద్వారా వైరస్ నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.