తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Municipalities Funds : పురపాలికల్లో ఇష్టారాజ్యంగా నిధుల వ్యయం - తెలంగాణ పురపాలికల నిధుల వ్యయం

Telangana Municipalities Funds : రాష్ట్రంలోని చాలా పురపాలికల్లో నిధుల వ్యయానికి జవాబుదారీతనం లేకుండా పోతోంది. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తాన్ని కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర ఆడిట్ శాఖ తెలిపింది. ఆరేళ్లుగా మొత్తం రూ.787 కోట్లకు అభ్యంతరాలున్నట్లు పురపాలక శాఖకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

Telangana Municipalities Funds
Telangana Municipalities Funds

By

Published : Mar 4, 2022, 6:50 AM IST

Telangana Municipalities Funds : ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న నిధుల వ్యయానికి చాలా పురపాలికల్లో జవాబుదారీతనం లేకుండా పోతోంది. చాలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇష్టారాజ్యంగా నిధుల వ్యయం ఉందని రాష్ట్ర ఆడిట్‌శాఖ నిగ్గు తేల్చింది. 2014-15 నుంచి 2019-20 వరకు ఆరేళ్లుగా మొత్తం రూ.787 కోట్లకు అభ్యంతరాలున్నట్లు పురపాలక శాఖకు ఇచ్చిన తాజా నివేదికలో పేర్కొంది. జీహెచ్‌ఎంసీ, వరంగల్‌ నగర పాలక సంస్థ మినహా రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో 20 వేలకుపైగా అంశాల్లో తేడాలున్నట్లు వివరించింది. ఇవి అత్యధిక సంఖ్యలో రంగారెడ్డి జిల్లాలో.. తర్వాత సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వరంగల్‌ జిల్లాలలో ఉన్నాయి.

వ్యయంలో ఇష్టారాజ్యం..

Funds Expenditure in Telangana Municipalities : నిధుల వ్యయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పురపాలికల్లో మొదటి స్థానంలో నల్గొండ జిల్లాలోని పురపాలక సంస్థలు.. తర్వాత స్థానాల్లో మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌, మంచిర్యాల, రంగారెడ్డి, గద్వాల, నిజామాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యయం చేశారనే అభ్యంతరాలపై ఏళ్లుగా పురపాలికలు స్పందించడం లేదు. కనీసం కాంట్రాక్టర్లకు చెల్లించిన అదనపు మొత్తాలను తిరిగి వసూలు చేయడానికి కూడా చర్యలు తీసుకోవడంలేదు. ఆడిట్‌ అభ్యంతరాలను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ కలెక్టర్లకు సూచించింది.

బేఖాతరు ఇలా..

  • మార్గదర్శకాలు పాటించకుండా సామగ్రి కొన్నారు.
  • ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు, సెస్‌లను వసూలు చేయకుండా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు.
  • కాంట్రాక్టర్‌కు ఒకే పనికి రెండు సార్లు చెల్లింపులు చేసేయడం లేదా ఎక్కువ ముట్టచెప్పడం వంటివి జరిగాయి.
  • ఒకే పనిని విడగొట్టి పలువురికి అప్పగించారు.
  • బడ్జెట్‌లో ఆమోదించకుండానే వివిధ పనులకు నిధులను వ్యయం చేస్తున్నారు. ఎంత పనిచేశారో లెక్కలు తేల్చక ముందే చెల్లింపులు చేశారు.
  • పలు వ్యయాలకు రికార్డులు, నిధుల వినియోగ ధ్రువపత్రాలను ఇవ్వలేదు.
  • కాంట్రాక్టర్లకు చెల్లించిన అడ్వాన్స్‌లను నిర్దేశించిన గడువులోపు వసూలు చేయాల్సి ఉండగా ఏళ్లుగడిచినా తిరిగి వసూలు చేయలేదు.

2019-20లో అక్రమాల్లో కొన్ని ఇలా..

కరీంనగర్‌ జిల్లాలో..

  • 63 ఆడిట్‌ అభ్యంతరాల్లో రూ.5.9 కోట్ల బకాయిలను వసూలు చేయలేదు.
  • రూ.71 లక్షల వ్యయానికి రికార్డులను లేవు. నిబంధనలు ఉల్లంఘించి రూ.2.4 కోట్లు వ్యయం చేశారు.
  • రూ.12.7 లక్షలను అదనంగా చెల్లించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో:

  • 198 పనులకు సంబంధించి రూ.5.9 కోట్ల వ్యయానికి రికార్డులు లేవు.
  • 3 పనుల్లో రూ.20 లక్షల దుర్వినియోగం చేశారు.
  • నాలుగు పనుల్లో రూ.29 లక్షల బకాయిలను వసూలు చేయలేదు.
  • 33 పనులకు సంబంధించి రూ.27 లక్షల వ్యయానికి రికార్డుల్లేవు.
  • 9 పనుల్లో రూ.98.9 లక్షలు అదనంగా చెల్లించారు.

జగిత్యాలలో:

  • రూ.2.5 కోట్ల విలువైన 27 పనులకు రికార్డుల్లేవు.
  • రూ.9 లక్షలు దుర్వినియోగంకాగా రూ.1.7 కోట్ల బకాయిలూ వసూలు చేయలేదు.

సిరిసిల్లలో:రూ.4.8 కోట్ల విలువైన 28 పనులకు రికార్డులు ఇవ్వలేదు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో: రూ.12.3 లక్షల అక్రమాలు జరిగాయి. 3.46 కోట్ల విలువైన 51 పనులకు రికార్డులు లేవు.

నల్గొండ జిల్లాలో:కోటి రూపాయల పనులకు రికార్డులు లేవు. రూ.13.15 కోట్ల బకాయిలను వసూలు చేయలేదు.

నిజామాబాద్‌ జిల్లాలో: రూ.4 కోట్ల విలువైన పనులకు రికార్డులులేవు. అధికమొత్తం చెల్లించడంతో పాటు నిధుల దుర్వినియోగం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details