Monkeys nuisance: ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా, బయట నుంచి ఇంట్లోకి వెళ్లాలన్నా ఎన్నో అవస్థలు పడేవారు. ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, ముసలివారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ కోతుల సమస్యలకు పరిష్కారం గురించి అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాడు. కానీ ఏ ఒక్కటీ వాటి విషయంలో పనిచేయకపోవడంతో చివరిగా వచ్చిన ఆలోచనతో ఫలితాన్ని సాధించాడు. అదే ఇంటి చుట్టూ ఇనుప జాలిని ఏర్పాటు చేయడం. ఇది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఓలం బుచ్చిలింగం అనే గృహ యజమాని తన ఇంటి చుట్టూ ఇనుప జాలీలతో కూడిన రక్షణ వ్యవస్థను నిర్మించుకున్నాడు.
దీంతో కోతుల సమస్య నుంచి శాశ్వత పరిష్కారం దొరికింది. వరంగల్ నుంచి ఈ పనిలో ప్రావీణ్యం ఉన్న వారిని తీసుకువచ్చి ఇంటి మొత్తాన్ని ఇనుప జాలితో పూర్తిగా మూసివేశారు. ఇంతటితో వానర మూకల సమస్య నుంచి పూర్తిగా విముక్తి లభించిందని ఆయన పేర్కొన్నారు. దీని నిర్మాణానికి 3 లక్షల 50 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని యజమాని తెలిపారు.