‘జీవితంలో ఏదైనా చదువుతోనే సాధించవచ్చు. గన్ను కన్నా పెన్ను గొప్పది’ అన్నది బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతం. మొదట్నుంచీ ఈ మాటలే నాకు స్ఫూర్తి అంటాడు బాలస్వామి. తన కుటుంబంలో, బంధువుల్లో అంతా నిరక్ష్యరాస్యులే. అయినా తనకి చదువు విలువ తెలుసు. ఇంటర్ పూర్తవగానే పద్దెనిమిదేళ్లకే జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కడు పేదరికంలో ఉన్న వారికి అది పెద్ద ఊరట. రెండేళ్లు కొలువు చేశాడు. పరిస్థితులు కుదుట పడ్డా పెద్ద చదువులు చదవాలనే ఆశ కుదురుగా ఉండనీయలేదు. దాన్ని వదిలేసి హైదరాబాద్ వచ్చేశాడు. పని చేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి. ఒకవైపు కూలి పనులకు వెళ్తూనే దూరవిద్యలో చేరాడు. డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు అందింది.
మొక్కవోని దీక్షతో... కూలీ నుంచి ఐపీఎస్ అయ్యాడు - inspiring story
కూలి పనులకు వెళ్తూనే డిగ్రీ, పీజీలు చేశాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వరించింది. ఆర్థిక భరోసాతోపాటు గౌరవమూ పెరిగింది. అయినా ఆగిపోలేదు.పేదల తలరాతను రాసే సివిల్స్‌కి గురి పెట్టాడు. ఆరో ప్రయత్నంలో ఐపీఎస్ దక్కించుకున్నాడు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి ఛార్జ్ తీసుకోబోతున్నాడు.
ఓయూకి వచ్చేదాకా బాలస్వామికి సమాజంపై పెద్దగా అవగాహన లేదు. కాలేజీకెళ్లడం, పాఠాలు చెప్పడం.. రొటీన్‌గా ఉండేది. అదే సమయంలో చాలా పేద కుటుంబం నుంచి వచ్చి, ఎన్నో కష్టాలు పడి సివిల్స్ సాధించిన రేవు ముత్యాల రాజు కథనం అతడ్ని కదిలించింది. సరికొత్త సంస్కరణలతో గురుకుల పాఠశాల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ గురించి చదివి స్ఫూర్తి పొందాడు. సివిల్ సర్వెంట్ అయితే ప్రజలతో నేరుగా సంబంధాలు నెరపొచ్చు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావొచ్చు అని అర్థమైంది. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా మారింది. సొంతంగా ప్రిపరేషన్ ప్రారంభించాడు. ఉదయం పిల్లలకు పాఠాలు బోధించడం, సాయంత్రం గ్రంథాలయానికి వెళ్లి చదవడం. సివిల్స్ నోటిఫికేషన్ వెలువడగానే ప్రయత్నించాడు. మూడుసార్లు వైఫల్యం ఎదురైంది. ‘తెలుగు మీడియం, పెద్దగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు.. నేను సివిల్స్ సాధించగలనా?’ అనే నిస్పృహ ఆవరించింది. ఇంతలోనే తన హీరోలను గుర్తు చేసుకునేవాడు. మళ్లీ రెట్టించిన పట్టుదలతో పుస్తకం అందుకునేవాడు. నాలుగో ప్రయత్నం గురి తప్పలేదు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) చేజిక్కింది. కానీ బాలస్వామిది సర్దుకుపోయే మనస్తత్వం కాదు. తన లక్ష్యం ఐఏఎస్ లేదా ఐపీఎస్. ఆరో ప్రయత్నంలో కలల ఐపీఎస్ చేజిక్కింది. రెండేళ్ల శిక్షణ పూర్తి చేసుకొని తెలంగాణ జిల్లాలో ఛార్జ్ తీసుకోబోతున్నాడు.
తీవ్రమైన కష్టాల్లో ఉన్న వ్యక్తి, అతడి కుటుంబం తలరాతను మార్చగల శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంటుంది. నాణ్యమైన విద్యతో మెరుగైన సమాజం తయారవుతుంది. ప్రయత్న లోపం లేకుండా, కష్టపడి పని చేస్తే ఆలస్యంగా అయినా విజయం దక్కుతుంది.