ప్రాణవాయువు అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో 11 మంది రోగులు చనిపోయిన ఘటనకు బాధ్యులెవరో ఇప్పట్లో తేలేలాలేదు. ఈనెల 10న ఆసుపత్రిలోని కొవిడ్ ఐసీయూ వార్డులో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. మృతుల కుటుంబానికి రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ.. ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ఆదేశించారు. పక్షం రోజులు దాటినా ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలో సభ్యులెవరు? ఇప్పటిదాకా జరిగిన విచారణ పురోగతి ఏంటి? అన్నది తెలియడం లేదు.
ఘటన జరిగిన మరునాడు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆసుపత్రిలో ప్రాథమిక విచారణ చేపట్టారు. వీరు విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఎలాంటి నివేదికా సమర్పించలేదని తెలిసింది. మరోపక్క, వైద్య ఆరోగ్య శాఖ డీఎంఈ అంతర్గత విచారణ (హౌస్ ఎంక్వైరీ) బృందాన్ని నియమించారు. ఎస్వీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ జయభాస్కర్ నేతృత్వంలో ఇద్దరు రుయా వైద్య విభాగాధిపతులతో నియమించిన ఈ కమిటీ.. ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని మాత్రమే నివేదిక రూపంలో డీఎంఈకి సమర్పించింది. ఆ తర్వాత చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి విచారణ బాధ్యతలు అప్పగించారు. నాడు విధుల్లో ఉన్న నర్సుల నుంచి మాత్రమే వాంగ్మూలాలు సేకరించిన ఈ కమిటీ.. వైద్యులు, వైద్యాధికారులను ఇంకా విచారించలేదు. ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీతో పాటు స్థానికంగా మూడు కమిటీలు వేసినా.. ఈ ఘటనకు బాధ్యులెవరన్నది తేలలేదు. ఏ కమిటీ సమగ్ర నివేదిక అందించలేదు.