తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్లాట్లుగా మారిపోతున్న చెరువులు.. కాలనీలను ముంచెత్తుతున్న వరదలు - telangana news

పట్ణణాలు, నగరాల్లో ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు.. వందల జలవనరులు కనుమరుగవుతున్నాయి.. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చినవాటిలో కొన్ని ఆక్రమణలపాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారుతున్నాయి. గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో వందల కోట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతోంది. నగరాలు, పట్టణాలు విస్తరిస్తుండడంతో పెద్దసంఖ్యలో చెరువులు ఆక్రమణలతో కుదించుకుపోయాయి. వాటిలో వందల కాలనీలు, వేల నివాసాలు పుట్టుకొచ్చాయి.గత ఏడాది వరదల తర్వాత నీటి పారుదల శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, రెవెన్యూ, పురపాలక అధికారులు పరిశీలించగా అనేక చెరువులు కనుమరుగైనట్లు, మరికొన్ని ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు కూడా. రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లోని చెరువుల దుస్థితిపై ప్రత్యేక పరిశీలన కథనం.

Invaders are occupying ponds in towns and cities
Invaders are occupying ponds in towns and cities

By

Published : Jul 13, 2021, 4:55 AM IST

చెరువులే ఆవాసాలుగా మారిన హైదరాబాద్‌ మహానగరంలో వందల కాలనీలను గత ఏడాది వరద అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల ప్రభుత్వ కార్యాలయాలను కూడా చెరువుల్లో నిర్మిస్తుండటం శోచనీయం. భారీ వర్షాలకు చెరువుల్లోకి చేరాల్సిన నీరు శిఖం భూముల్లో ఆక్రమించి నిర్మించిన ఇళ్లలోకి, వీధుల్లోకి చేరుతోంది. చెరువులు నిండితే నీరు బయటకు వెళ్లాల్సిన వాగులను సైతం ఆక్రమించేశారు.

కబ్జాలకు కారణాలు

  • అధికార యంత్రాంగం ఉదాసీనత.
  • చెరువుల సరిహద్దులు నిర్దేశించకపోవడం.
  • పట్టణ, నగరాల్లో భూములకు భారీ డిమాండ్‌ ఉండటం.
  • ఆక్రమించి తప్పుడు డాక్యుమెంట్లతో భూముల విక్రయం.
  • రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక శాఖల మధ్య సమన్వయ లోపం.
  • చట్టంలోని లొసుగుల్ని ఆసరాగా చేసుకోవడం.
  • ఆక్రమణలు గుర్తించినా తొలగించకపోవడం.
  • చెరువు గర్భాల్లో నిర్మించిన నివాసాలకు విద్యుత్‌, నీటి వసతి కల్పించడం.
  • కొంతమంది ప్రజాప్రతినిధులే పలుచోట్ల చెరువుల్ని ఆక్రమించి వెంచర్లు వేయడం.
  • వరదొచ్చి మునిగినప్పుడే తప్ప మిగతా సమయాల్లో అధికారులు ఆక్రమణలపై దృష్టిసారించకపోవడం.

వరంగల్‌ ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మాణాలు.. తప్పని ముంపు

రంగల్‌ మహా నగరపాలక సంస్థ పరిధిలో 86 చెరువులు, కుంటలు ఉన్నాయి. కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువులు ఆక్రమణకు గురవడంతో వరద వరంగల్‌ త్రినగరాలను ముంచెత్తుతోంది. శివారు గ్రామాల్లో చెరువులు అలుగు పోయడంతో వరంగల్‌ నీట మునిగింది. వర్దన్నపేట కోనపురం, కొండపర్తి చెరువులు తెగి నగరాన్ని అతలాకుతలం చేశాయి. త్రినగరాల్లో భద్రకాళి, వడ్డేపల్లి, కోట చెరువు, బంధం, ఉర్సు చెరువు, దేశాయిపేట చిన్నవడ్డేపల్లి, న్యూశాయంపేట కోటి చెరువులకు 2013లో పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్‌) హద్దులు ఖరారు చేశారు. దిమ్మెలు ఏర్పాటు చేశారు. అయినా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరిగాయి. గొర్రెకుంట, కట్టమల్లన్న, హసన్‌పర్తి, కడిపికొండ, భట్టుపల్లి చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. వరంగల్‌ పరిధిలో ఆరు చెరువులకు సంబంధించి వంద ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది.

నివారణ చర్యలు

  • వరదల నియంత్రణకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
  • ఆక్రమణలను గుర్తించి తొలగించడమే కాదు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
  • శాఖల మధ్య సమన్వయం ఉండాలి.
  • నిర్మాణాలను ఆరంభ సమయంలోని గుర్తించి అడ్డుకోవాలి.
  • ప్రస్తుత చెరువులు, కుంటల సామర్థ్యం గుర్తించాలి.
  • చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్‌) పరిధిని నిర్దేశించాలి.

ఖమ్మం కాసారాలను పూడ్చి కాలనీలు

ఖమ్మం లకారం చెరువు నగరం మధ్యలో ఉంది 10 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు అంచనా. శిఖంలో కొంత ఆర్‌డబ్ల్యూఎస్‌కు కేటాయించడం విశేషం. జయనగర్‌ కాలనీలో పలు నివాసాలు ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నాయి. తాజాగా కూడా ఇళ్లు నిర్మించేందుకు శిఖం భూమిలో మట్టి, రాళ్లతో పూడ్చేస్తున్నారు. ధంసలాపురం పెద్ద చెరువు పూడ్చివేతకు గురైంది. పాల్వంచ రాతిచెరువు, చింతŸల చెరువులను పూడ్చి నిర్మాణాలు చేపట్టారు.

మహబూబ్‌నగర్‌ ఆక్రమణల పరం

హబూబ్‌నగర్‌ పట్టణంలో గాండ్లోని చెరువు శిఖం ఆక్రమణకు గురైంది. న్యూప్రేమ్‌నగర్‌ పేరిట నిర్మాణాలు వెలిశాయి. పెద్దచెరువు సైతం ఆక్రమణలకు గురైంది. రామయ్యబౌలి, న్యూటౌన్‌ వైపు చెరువులో ఇళ్లను నిర్మించారు. పాల్‌కొండ పెద్దచెరువులో సైతం పెద్ద సంఖ్యలో ఆక్రమణలు జరిగాయి. శిఖం భూమిని ప్లాట్లు చేసి విక్రయించగా ఇళ్లు వెలిశాయి. వర్షాలు కురిసినప్పుడల్లా వాటిలోకి నీరు చేరుతోంది. దొంగలకుంట చెరువును పూడ్చివేసి వెంచర్‌ ఏర్పాటుకు విఫలయత్నం చేస్తున్నారు. ఇమాసాబ్‌కుంటను సైతం ఆక్రమించి ప్లాట్లు చేస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలూ కట్టేశారు

  • చౌటుప్పల్‌ ఊరచెరువు ఆరెకరాలు ఆక్రమణకు గురైంది. ఎఫ్‌టీఎల్‌ లోపల మండలపరిషత్‌, తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాలు, పాలశీతలీకరణ కేంద్రంతోపాటు 4 గృహ నిర్మాణాలున్నట్టు అధికారులు గుర్తించారు.
  • కరీంనగర్‌ నగర పరిధిలోని సదాశివపల్లిలో ఉన్న రెండు చెరువుల్లో ఒకటి నీళ్ల కోసం ఉపయోగపడుతోంది. సీతారాంపురం, ఆరేపల్లి మధ్య ఉన్న చెరువు సగం ఆక్రమణకు గురైంది. ఎగువ ప్రాంతాల్లోని వరదనీరంతా నగరంలోకి వస్తోంది.
  • నిజామాబాద్‌ పట్టణ పరిధిలో 5 చెరువులు ఉండగా రామర్తి చెరువులో నివాసాలు ఏర్పడ్డాయి. వెంగళ్‌రావునగర్‌ చెరువు నామరూపాల్లేకుండా పోయింది.
  • నల్గొండ పట్టణం చర్లపల్లిలోని భీమేశ్వర్‌ చెరువులో ఏకంగా వెంచర్లే వెలిశాయి. వరదొస్తే ఆ కాలనీలు మునిగిపోతున్నాయి. కతాలగూడెంలోని కుంటలో పూర్తిగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి.
  • ఆర్మూర్‌లోని మల్లారెడ్డి చెరువు కట్ట స్థలం ఆక్రమించి ప్లాట్లు, వెంచర్లు వెలిశాయి. నీరు బయటకు వెళ్లే మార్గాలను మూసేశారు.
  • భూపాలపల్లిలో పుల్లూరి రామయ్యపల్లి శివారులో తుమ్మల చెరువు, గోరంట్లకుంట చెరువుల శిఖం భూములు దాదాపుగా 10 ఎకరాల వరకు ఆక్రమణకు గురయ్యాయి. అక్కడ ప్రస్తుతం ఎకరా రూ. 60 లక్షలకు పైగా ధర పలుకుతోంది. రియల్టర్లు కొందరు శిఖం భూములను ప్లాట్లుగా విభజించి అమ్ముకున్నారు. తుమ్మల చెరువులోకి వచ్చే వరద కాలువను మళ్లించిన ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు.
  • జగిత్యాల పట్టణంలోని చింతకుంట, మోతె, చెరువుల్లో ఆక్రమణలు జరిగాయి. దీని విస్తీర్ణం తగ్గడంతో నీరు నిల్వ ఉండడంలేదు.
  • కోరుట్లలోని మద్దుల, తాళ్ల చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. మద్దుల చెరువు చుట్టూ పట్టణం విస్తరించడంతో కొందరు నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు చెరువు భూమిని ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయించారు. మద్దులచెరువు సుమారు ఐదెకరాలు పైగా ఆక్రమణకు గురైంది. తాళ్లచెరువు ఆరు ఎకరాల పైగా ఆక్రమణల పాలైంది.
  • నాగర్‌కర్నూల్‌ పట్టణం కేసరి సముద్రం చెరువు బఫన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో దాదాపుగా 25 ఎకరాల్లో వెంచర్లు వేశారు. ఇందులో ఇప్పటికే కొందరు నిర్మాణాలు పూర్తి చేశారు.

వరదలతో హైదరాబాద్‌ విలవిల

హైదరాబాద్‌ మహానగరం గత ఏడాది అక్టోబరులో వరదలతో విలవిలలాడింది. నాలుగైదు వందల కాలనీలు కనీసం రెండు మూడు వారాలపాటు ముంపులో చిక్కుకుని విలవిలలాడాయి. ఏకంగా పది అడుగుల వరకు వరదనీరు నిలిచి స్థానికులు పడిన అవస్థలు వర్ణనాతీతం. హైదరాబాద్‌లో 192 చెరువుల ఉండగా దాదాపు అన్నీ ఆక్రమణలపాలయ్యాయి. చెరువుల్లోనే కాలనీలు పుట్టుకొచ్చాయి. సరూర్‌నగర్‌ చెరువు, బతుకమ్మ చెరువు, గుర్రం చెరువు, దుర్గం చెరువు, చందం చెరువు, సాకి చెరువు, తీగలసాగర్‌ చెరువు, రాయసమద్రం చెరువు, తిమ్మక్క చెరువు సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణలతో నామమాత్రంగా మిగిలాయి. మూసీ పరివాహక ప్రాంతంలో 6,350 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడిక్కడ నీరు నిలిచి వెళ్లే అవకాశం లేక నగరంలో అనేక లోతట్టు ప్రాంతాలు సముద్రాల్లా మారాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం ఆక్రమణలే.

రాజధాని కథే వేరు..

హైదరాబాద్‌ మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఇప్పటికే వందలాది చెరువులు కనుమరుగైపోయాయి. ఆల్వాల్‌, బండ్లగూడ జాగీర్‌, బోడుప్పల్‌, హబ్సిగూడ, నాచారం, తుక్కుగూడ, తుర్కయంజాల్‌, శంషాబాద్‌, జవహర్‌నగర్‌, బాలాపూర్‌ సహా పలు మున్సిపాలిటీల్లో ఆక్రమణల పరంపర కొనసాగుతోంది.

  • రిసాలాబజార్‌లోని బతుకమ్మకుంట, కానాజిగూడలోని శ్రీరాంకుంట కనుమరుగై కాలనీలు వెలిశాయి. కొత్తచెరువు, చిన్నారాయుని చెరువులు కబ్జాల పాలయ్యాయి. ఎగువన దిగువన కాలనీలు పుట్టుకొచ్చాయి. నాగిరెడ్డి చెరువులో దౌర్జన్యంగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి.
  • హైదర్షాకోట్‌లోని నల్లకుంట చెరువులో ఏకంగా ఓ భారీ నిర్మాణం, పలు ఇళ్లూ నిర్మాణమయ్యాయి. కిస్మత్‌పూర్‌లోని నల్లగుంట చెరువు శిఖం కబ్జా చేసి లేఅవుట్‌లో కలిపేశారు. పీరంచెరువు శిఖంలోనూ పెద్ద ఎత్తున నిర్మాణాలు వెలిశాయి.
  • బోడుప్పల్‌లోని ఏడు చెరువులు, చెంగిచర్లలోని చింతలకుంట చెరువు ఆక్రమణల పాలయ్యాయి. సుద్దకుంట, అల్మాస్‌కుంట, చాకలిగండీ, చెన్నాయికుంట, పోచమ్మకుంటలు పూర్తిగా కనుమరుగైపోయాయి. చెంగిచర్ల చింతల చెరువులోనూ కాలనీలు పుట్టుకువచ్చాయి. రాచెరువు 48 ఎకరాలకు గాను 20 ఎకరాలే మిగిలింది. చింతలకుంట చెరువు 40 ఎకరాల నుంచి 15 ఎకరాలకు పరిమితమైంది.
  • మేడిపల్లి చెరువు 30 ఎకరాల నుంచి 3 ఎకరాలకు చేరింది. శిఖంలో ఏర్పాటైన లే-అవుట్‌ వల్ల కొత్త కాలనీలు వచ్చాయి. తూముల్ని మూసి వేయడంతో భారీ వర్షాలకు పంచవటికాలనీ, మేకల బాల్‌రెడ్డికాలనీ, కమలానగర్‌ నీట మునిగాయి.
  • రామంతాపూర్‌ పెద్ద చెరువు 26 ఎకరాల విస్తీర్ణం ఉండేది. ప్రస్తుతం 19 ఎకరాలు మాత్రమే ఉంది. ఇక్కడ అనేక భవనాలు, వాణిజ్య సంస్థల నిర్మాణాలు వచ్చాయి. అక్రమణల వల్ల సమీపంలోని కాలనీలన్నీ నీటమునిగి భారీగా ఆస్తి నష్టం జరుగుతోంది. కనీసం పది రోజులపాటు కాలనీలన్నీ జలదిగ్భందంలో ఉన్నాయి.

ఇవీ చూడండి: RAINS: భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

ABOUT THE AUTHOR

...view details