ప్రశ్న : రాష్ట్రంలో ఈ సారి ఎన్ని కోట్ల చేప పిల్లలు, రొయ్య పిల్లలు... ఎంత పరిమాణంలో పంపిణీ చేయబోతున్నారు..? అందుకోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు.?
జవాబు : రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే వ్యవసాయ అనుబంధ రంగాలకు మంచి రోజులు వచ్చేశాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచే ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నది సీఎం ఆలోచన. కుల వృత్తులపై ఆధారపడిన కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న యోచనలో భాగంగా గంగపుత్రులు, ముదిరాజు, తెనుగు, గోండ్లకు ఉచితంగా చేప విత్తనం పంపిణీ గత ఐదేళ్లుగా బ్రహ్మండంగా చేస్తున్నాం. ఈ ఏడాది రమారమి 24 వేల చెరువుల్లో 81 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు సరఫరా చేయబోతున్నాం. ఇది ఒక సంపద సృష్టించి ఆయా కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. వారు సమాజంలో సగౌరవంగా జీవించాలన్నది లక్ష్యం. ఆగస్టు 5 నుంచి చేపట్టబోతున్న ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక వనరులు కల్పించనట్లవుతోంది.
ప్రశ్న : ఈ ఏడాది చేప పిల్లల పంపిణీలో తెలంగాణ చేప "కొర్రమీను"కు ఏమైనా ప్రాధాన్యత ఇస్తున్నారా?... ఏ ఏ రకాలు సరఫరా చేస్తున్నారు.?
జవాబు : బంగారు తీగ లాంటి రకాల విత్తనాలు ఇస్తున్నాం. కొర్రమీను రకం చేప పిల్లలు ఇవ్వాలంటే మనకు దేశంలోనే అంత భారీ పరిమాణంలో దొరకవు. తెలంగాణ వాతావరణం పరిస్థితులు, నేలలు, నీరు, ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా చేప పిల్లలే ఇస్తున్నాం. అదే రీతిలో సంపద కూడా వస్తుంది. కాబట్టి ఈ రోజు మత్స్యకార కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. దేశంలో తొలిసారిగా తెలంగాణలో రొయ్యలు కూడా పరిచయం చేశాం. అవి ఈ సారి పెద్ద ఎత్తన పెంచాం.
ప్రశ్న : తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో మత్స్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు నోచుకోలేదు. అందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా...?
జవాబు : ఈ రోజున మత్స్య పరిశోధన అనేది సాగుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా పాలేరు సహా మానేరు డ్యాం, వనపర్తి వద్ద మత్స్య పరిశోధన స్థానం ఏర్పాటు కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నాం. తప్పకుండా రాబోవు రోజుల్లో మత్స్యకార కుటుంబాలు, రైతులు బాగుండాలి. ఆర్థిక సంపద పెరగాలి. మన రాష్ట్రం కాకుండా దేశానికి, ప్రపంచంలో వివిధ దేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ పద్ధతిలోనే ప్రోత్సహిస్తున్నారు.
ప్రశ్న : ఈ ఏడాది ప్రతిష్టాత్మక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా నీటి లభ్యతలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మత్స్య సంపద వృద్ధి రేటు ఎలా ఉండబోతోంది. ప్రభుత్వపరంగా ఎలాంటి లక్ష్యాలు నిర్థేశించింది.?
జవాబు : బ్రహ్మాండంగా... నేను ఏమంటా అంటే ప్రతి నీటి బొట్టు ఉన్న దగ్గరల్లా చేప పిల్లలు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని శాసనసభలో సైతం సీఎం స్పష్టం చేశారు. గత ఏడాది కొండపొచమ్మసాగర్, కాళేశ్వరం, సుందిళ్లలో కూడా చేప పిల్లలు వేశాం. ఈ సారి రంగనాథసాగర్, కొండపోచమ్మసాగర్ సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన జలాశయాల్లో చేపలు వేయబోతోన్నాం.
ప్రశ్న : ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల తరహాలో తెలంగాణలో కూడా ఫిష్ కల్చర్‌ను పరిశ్రమ తరహాలో తీర్చిదిద్దే అవకాశం ఉందా... ఆసక్తిగల ఔత్సాహికపారిశ్రామికవేత్తలకు ఆ రకమైన ప్రోత్సాహకాలు ఇస్తారా...?
జవాబు : తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. ఏపీలో ప్రైవేటుగా చేస్తున్నారు. పెద్దగా ప్రభుత్వం మద్ధతు ఉండదు. తెలంగాణలో ప్రభుత్వమే మద్ధతు ఇచ్చి ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంకా చేయూతనివ్వాలన్నదే తమ లక్ష్యం. ఎందుకంటే యువతరం కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తోంది. విద్యావంతులు, నిరుద్యోగులు సైతం మత్స్య రంగంలో నైపుణ్యాలు సంపాదించేందుకు వీలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహణకు శ్రీకారం చుట్టాం.
ప్రశ్న : కరోనా నేపథ్యంలో నగరాలు, పట్టణాల నుంచి యువత, ప్రైవేటు, ఐటీ, సేవా, ఇతర రంగాలకు చెందిన కుటుంబాలు గ్రామాలబాట పట్టడంతో నిరుద్యోగం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అలాంటి వారిని మత్స్య రంగంపై మళ్లించే అవకాశం ఉందా...?