తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రతి ఇంటికి స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ విద్యుత్తు మీటర్‌' - ERC CHAIRMEN SRIRANGARAO news

‘తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కరెంటు ఛార్జీలు పెంచలేదు. ఏళ్ల తరబడి పెంచకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయని.. ఛార్జీలు పెంచాలనే ఆలోచనతో విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదనలిస్తే అన్ని వర్గాలతో చర్చించిన తరువాతే రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) తగు నిర్ణయం తీసుకుంటుంది’ అని ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావు చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల మూడు నెలల కరెంటు రీడింగ్‌ ఒకేసారి తీసి నెలవారీగా సగటు చేసి బిల్లు ఇవ్వడం వల్ల ఎక్కువ కట్టాల్సి వచ్చిందని పలు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో కరెంటు ఛార్జీల సవరణకు మంగళవారం(జూన్‌30)లోగా డిస్కంలు ‘వార్షిక ఆదాయ అవసరాల’(ఏఆర్‌ఆర్‌) నివేదికను ఈఆర్‌సీకి ఇస్తాయని అంచనా. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్తు రంగం పనితీరుపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.

ERC CHAIRMEN SRIRANGARAO
ERC CHAIRMEN SRIRANGARAO

By

Published : Jun 30, 2020, 8:37 AM IST

ఏటా నవంబరులోగా ఏఆర్‌ఆర్‌ నివేదికను ఈఆర్‌సీకివ్వాలనే నిబంధనను డిస్కంలు పాటించడం లేదు కదా. దీని అమలుకు ఏమీ చేయలేదా ?

నిబంధన ఉన్న మాట వాస్తవమే. సకాలంలో ఏఆర్‌ఆర్‌ నివేదిక ఇవ్వకపోతే డిస్కంలకే నష్టం జరుగుతుంది. ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఎంత కరెంటు అవసరం అనే అంచనాలను నీటిపారుదల శాఖ ఆలస్యంగా ఇవ్వడం వల్ల నవంబరులోగా నివేదికను డిస్కంలు ఇవ్వలేకపోయాయి. ఈ నెల 30 వరకు గడువు అడిగాయి. మంగళవారం ఇస్తాయనుకుంటున్నాం.

డిస్కంలు నష్టాల్లో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ?

కేంద్రం ‘ఆదిత్య’ పథకాన్ని తేబోతోంది. రూ.లక్షన్నర కోట్లను అన్ని రాష్ట్రాలకు గ్రాంటుగా ఇవ్వబోతోంది. ఈ పథకంలో భాగంగా ప్రస్తుత మీటర్ల స్థానంలో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను ‘బూట్‌’ విధానంలో పెడతారు. అంటే ఏదైనా ఒక కంపెనీకి స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు పనులిస్తారు. సదరు కంపెనీ సొంత ఖర్చుతో మీటర్లు పెడుతుంది. అవి పెట్టిన తరువాత కరెంటు సరఫరాలో ప్రస్తుతమున్న నష్టాలు తగ్గి డిస్కంలకు ఆదాయం పెరుగుతుంది. అదనంగా వచ్చే ఆదాయం నుంచి మీటర్లు కోసం కంపెనీలు పెట్టిన ఖర్చును వాయిదాల్లో డిస్కంలు చెల్లిస్తాయి. దీంతో ప్రజలపై మీటర్ల ఏర్పాటు భారం ఉండదు. తర్వాత కాలంలో డిస్కంలకూ ఆదాయం పెరుగుతుంది. ఆదిత్య పథకం కింద విద్యుత్తు రంగ అభివృద్ధికి 60 శాతం నిధులు కేంద్రమిస్తే 40 శాతం డిస్కంలు అప్పుగా భరించాలి.

లాక్‌డౌన్‌లో కరెంటుఛార్జీలు పెంచి భారం వేశారని ప్రజలంటున్నారు..ఈఆర్‌సీ దృష్టికొచ్చిందా ?

లాక్‌డౌన్‌ వల్ల మీటరు రీడింగ్‌ తీయకుండా 2019 ఏప్రిల్‌, మే నెలల బిల్లులనే ఈ ఏడాది అదే నెలల్లో ఇవ్వమని ఈఆర్‌సీ ఆదేశాలిచ్చిన మాట వాస్తవమే. ఒకేసారి జూన్‌లో మూడు నెలల రీడింగ్‌ తీయడం వల్ల బిల్లులు ఎక్కువ వచ్చాయనే ఫిర్యాదులు రావడంతో నేను స్వయంగా డిస్కంల సీఎండీలతో మాట్లాడాను. ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరి బిల్లును తనిఖీ చేసేందుకు కమిటీలు వేసినట్లు డిస్కంలు తెలిపాయి. బిల్లులు ఎక్కువొచ్చాయనే అపోహలు ప్రజల్లో వచ్చినందున వాటిని సరిదిద్దాల్సిన అవసరముంది.

వినియోగదారుడే విద్యుత్తు మీటరు రీడింగ్‌ను సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి అప్‌లోడ్‌చేస్తే బిల్లు ఇచ్చే విధానం అమలును ఎందుకు పరిశీలించడం లేదు ?

ఇది చాలా మంచి విధానం. మంచి సూచన. దీని అమలుతీరును వివరిస్తూ ‘ఈనాడు’లో ఇటీవల వచ్చిన వార్తా కథనం చదివాను. లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం రీడింగ్‌ తీసుకోండని డిస్కంలకు ఈఆర్‌సీ ఉత్తర్వులు జారీచేసిన తర్వాత ఆ వార్త వచ్చింది. ముందే ఈ వార్త వచ్చి ఉంటే ఆ విధానం అమలుచేయాలనే ఆదేశాలను డిస్కంలకు ఈఆర్‌సీ ఇచ్చి ఉండేదని మేం అనుకున్నాం. ఈ విధానం ఇప్పటికే దిల్లీలో బాగా అమలుచేస్తున్నారు. తెలంగాణలో కూడా అమలుకు డిస్కంలను ఆదేశిస్తాం.

విద్యుత్తు సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించి చూపుకోవడానికి వ్యవసాయానికి ఎక్కువ వాడుతున్నట్లు డిస్కంలు చెబుతున్నాయనే ఆరోపణలున్నాయి ?

వ్యవసాయ బోర్లన్నింటికీ తప్పనిసరిగా మీటర్లు పెట్టాల్సిందే. మీరు చెప్పింది కూడా వాస్తవమే. మహారాష్ట్రలో కరెంటు సరఫరా, పంపిణీలో వచ్చే నష్టాలను తగ్గించి చూపించుకోవడానికి వ్యవసాయానికి ఎక్కువ వాడుతున్నట్లు ఆ రాష్ట్ర ఈఆర్‌సీ జరిపిన విచారణలో నిర్ధారణ అయింది. ఇప్పుడు కేంద్రం తెచ్చే ఆదిత్య పథకంలో కూడా తప్పనిసరిగా వ్యవసాయానికి మీటర్లు పెట్టాలనే నిబంధన పెడుతోంది.

విద్యుత్తు చట్ట సవరణ బిల్లులోని ప్రతిపాదనలతో ఈఆర్‌సీపై తీవ్రప్రభావం పడుతుందా?

ఈ బిల్లులో ప్రతిపాదించిన సవరణలతో తీవ్ర ప్రభావం పడుతుంది. అన్ని రాష్ట్రాల ‘ఈఆర్‌సీల వేదిక’ సమావేశాలు ఇటీవల 3 రోజుల పాటు ఆన్‌లైన్‌ ద్వారా జరిగాయి. ఈ బిల్లులోని అంశాలపై తప్పనిసరిగా స్పందించాలని నేను, త్రిపుర ఈఆర్‌సీ ఛైర్మన్‌ ప్రత్యేకంగా కోరడంతో.. ఈ బిల్లులోని పలు అంశాలను వ్యతిరేకిస్తూ దాదాపు అన్ని ఈఆర్‌సీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. అన్ని మండళ్లు వ్యతిరేకతను తెలుపుతూ పలు సూచనలు, అభ్యంతరాలను కేంద్రానికి వేదిక ద్వారా పంపాం. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై వివాదాలేర్పడితే జాతీయ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మండలి ఏర్పాటుద్వారా పరిష్కరిస్తామని బిల్లులో ప్రతిపాదించారు. ఈ మండలి ఏర్పాటు అవసరం లేదని కూడా వేదిక స్పష్టం చేసింది. జాతీయ లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రం ద్వారా రాష్ట్రాల మధ్య కరెంటు సరఫరాను నియంత్రించాలనే ప్రతిపాదనను కూడా వ్యతిరేకించాం.

ఇదీ చదవండి:1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details