- విత్తన చట్టం పటిష్ఠంగా లేనందు వల్లనే నాసి రకం విత్తనాలు పెరిగిపోతున్నాయా?
కొత్త విత్తన చట్టం ఎన్నో ఏళ్ల క్రితం పార్లమెంటులో ఆమోదం పొందినా.. బయటికి రాకపోవడం సమస్యగా మారింది. దాన్ని పటిష్ఠంగా రూపొందిస్తేనే రైతులకు నాసిరకం విత్తనాల నుంచి రక్షణ లభిస్తుంది. 1966లో వచ్చిన పాత చట్టం ప్రకారం నాసిరకం విత్తనాలను అరికట్టలేకపోతున్నారు. ఆ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నా కోర్టుల్లో.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేక తీర్పులు వస్తాయి.
- నాసిరకం విత్తనాల విక్రయాలు పెరిగాయి. రైతులు వీటి నుంచి ఎలా బయటపడాలి ?
విత్తన కంపెనీ తయారుచేసిన విత్తనాలను మార్కెట్‌లో అమ్మితే ఆ ప్యాకెట్లపై లేబుల్ వేయాలనే నిబంధన ఉంది. వాటిని ఎక్కడ పండించారు, ఎంత మొలక శాతం వస్తుంది, తేమ, స్వచ్ఛత ఎంత ఉంటుంది తదితర వివరాలను ప్రతీ కంపెనీ లేబుల్‌పై ముద్రించి ప్యాకెట్‌పై అంటించాలి. రైతులు ఈ లేబుల్‌ను నిర్ధారించుకున్నాకే కొని బిల్లు తీసుకోవాలి. లేబుల్, బిల్లును భద్రపరచుకోవాలి. నాసి రకం అని తేలితే ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చు.
- విత్తనాలు నాటిన తరవాత పైరు పెరిగి పూత, కాత రాకపోతే ఏం చేయాలి?
విత్తనాలు లేదా నారు కొనే సమయంలోనే పూర్తి వివరాలను తెలుసుకోవాలి. రైతులు టమాట, మిరప, ఆయిల్‌పాం తదితర పంటలకు నారును కొని నాటుతున్నారు. ఈ నారునే కొనే సమయంలోనే వాటిని ఏ విత్తనాలతో పెంచారని రైతులు పరిశీలించాలి.
- విత్తనాలను ప్యాకెట్లలో కాకుండా విడి(లూజు)గా అమ్ముతున్నారు. వాటి నాణ్యతను గుర్తించేదెలా?
విడిగా అమ్మేవాటిని కొనకూడదు. విడిగా అమ్మేవి నాసి రకం లేదా నకిలీ విత్తనాలే అని గమనించాలి. వాటిని సాగు చేశాక పంట సరిగా రాలేదని రైతులు బాధపడినా ఎవరూ పట్టించుకోరు. వాటిని అమ్మిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికీ ఉండదు.
- నాసి రకం విత్తనాలను పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేయాలి?
మానవ వనరులు లేకుండా ఏ విభాగం కూడా సమర్థంగా పని చేయలేదు. విత్తనోత్పత్తిలో నిల్వ, శుద్ధి, రవాణా, విక్రయాలకు మౌలిక సదుపాయాలుండాలి. ప్రభుత్వానికి ఇన్ని వనరులు లేకనే ప్రైవేటు విత్తన కంపెనీలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కొత్త విత్తన చట్టంలో కఠిన నిబంధనలు చేర్చి వాటిని అమలుచేస్తే నాసి రకం విత్తనాలను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చు. రైతులు పెసర, మినుము, సెనగ, వేరుసెనగ తదితర పంటల విత్తనాలను సొంతంగా పండించుకుంటే ప్రైవేటు కంపెనీలవి కొనే అవసరమే ఉండదు.
- వర్సిటీ, వ్యవసాయ శాఖకు వందలాది ఎకరాల భూములున్నా మేలైన విత్తన పంటలెందుకు పండించలేకపోతున్నారు?
కొత్త వంగడాలపై పరిశోధనలు చేసి వాటిని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు ఇవ్వడం వర్సిటీ బాధ్యత. రైతులతో పంటలు పండించి విత్తనోత్పత్తి చేసి విస్తరింపజేయాలి. వ్యవసాయ శాఖ నర్సరీల్లో ఆ శాఖ అధికారులే విత్తన పంటలు పండించాలి. ఉదాహరణకు.. వర్సిటీ ఒక కొత్త వంగడానికి చెందిన 400 క్వింటాళ్ల మూల విత్తనాలను విత్తన సంస్థకు ఇచ్చి దాన్ని మూడేళ్లపాటు పండిస్తే 50 లక్షల ఎకరాలకు సరిపోయేంత నాణ్యమైన విత్తనాలు లభిస్తాయి.
- ప్రైవేటు కంపెనీల విత్తనాలే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వర్సిటీ వంగడాలెందుకు ప్రచారం పొందడం లేదు?
సంకరజాతి విత్తనాలను ప్రైవేటు విత్తన కంపెనీలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. స్థానిక రకాలను ఇస్తే రైతులు మరుసటి ఏడాది మళ్లీ తమ విత్తనాలను కొనరనే భయం కంపెనీలకు ఉంది. వర్సిటీ వంగడాలకూ ప్రచారం బాగానే ఉంది.
- విత్తన పంటలు పండించిన కంపెనీలు కొంత పంటను రైతులకు వెనక్కి ఇస్తున్నాయి. దీన్ని ఎలా నియంత్రించాలి?
ఏ కంపెనీ కూడా కొంత పంటను తిరస్కరించి రైతులకు వెనక్కి ఇవ్వకూడదు. విత్తన పంట సాగు ప్రారంభానికి ముందే దాన్ని కొంటామని కంపెనీ ఒప్పందం చేసుకుంటుంది. నాణ్యత లేని పంటలను కంపెనీలు వెనక్కి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. కంపెనీలు వెనక్కి ఇచ్చిన నాసి రకం విత్తన పంటను ఇతరులకు అమ్మితే.. వాటిని కొని నాటిన వారు తీవ్రంగా నష్టపోతారు. ప్రతీ కంపెనీ ఏ విత్తన పంటను ఎంత విస్తీర్ణంలో పండిస్తుందనే వివరాలు సేకరించి వాటి దిగుబడులను పూర్తిగా కొన్నారా లేదా అని వ్యవసాయాధికారులు తనిఖీలు చేయాలి.
- వర్సిటీ ఎన్నో ఏళ్లుగా మూల విత్తనాలు ఇస్తూనే ఉంది. అయినా నాణ్యమైనవి ఎందుకు అందడం లేదు?
పత్తి, మొక్కజొన్న కాకుండా ఇతర పంటల్లో ఏటా లక్షా 25 వేల క్వింటాళ్ల మూల విత్తనాలను వ్యవసాయ పరిశోధనా సంస్థలు, వర్సిటీలు ఇస్తున్నాయి. 40 వేల క్వింటాళ్ల మూల విత్తనాలుంటేనే దేశం మొత్తానికి అవసరమైన విత్తనోత్పత్తి చేయవచ్చు. అంతకన్నా మరో 2 రెట్లు ఎక్కువగా మూల విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నా నాణ్యమైన విత్తనాలు ఎందుకు రావడం లేదనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్నే. మూల విత్తనాల నుంచి విత్తన పంటలు సాగుచేసి పెద్దయెత్తున విత్తనోత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలనే బాధ్యతను రాష్ట్ర విత్తన సంస్థలు తీసుకుంటేనే నాణ్యమైన విత్తనాలు సులభంగా అందుతాయి.
- కొన్ని సంస్థలు బోగస్ లేబుళ్లు అంటించి పెద్ద కంపెనీల పేర్లతో నకిలీ ప్యాకెట్లను అమ్ముతున్నాయి. వాటి నుంచి రైతులు ఎలా బయటపడాలి ?
ప్యాకెట్‌పై ఏ కంపెనీ లేబుల్ అంటించారని చూడాలి. ఆ కంపెనీని సంప్రదించి వివరాలు సేకరించాలి. ఆ విత్తన ప్యాకెట్.. కంపెనీ పంపిణీ చేసిన లాట్‌లో ఉందా లేదా అని పరిశీలిస్తే అది నకిలీదా కాదా అని తెలిసిపోతుంది. ప్రతీ ప్యాకెట్‌పై విత్తనోత్పత్తి చేసిన కంపెనీ వివరాలుంటాయి. ఆ వివరాల ఆధారంగా కంపెనీని సంప్రదించి.. అవి వారి విత్తనాలేనా కాదా అని నిర్ధారించుకోవాలి. కంపెనీ వివరాలు ప్యాకెట్‌పై లేకపోతే కొనకూడదు.
ఇదీ చూడండి: