Interruption to SBI services: దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి ఎస్‌బీఐ సేవలు పూర్తిగా స్తంభించాయి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి బ్యాంకింగ్ సేవలు తరుచూ అంతరాయం ఏర్పడుతూ వచ్చాయి. ఒంటి గంట నుంచి పూర్తిగా ఎస్‌బీఐ సేవలు నిలిచిపోయాయి. ఖాతాదారులకు సంబధించిన అన్ని రకాల సేవలు ఆగిపోయాయి. అన్‌లైన్ లావాదేవీలు, బ్రాంచీల్లో కొనసాగాల్సిన లావాదేవీలు, ఏటీఎంల లావాదేవీలతో పాటు అన్ని రకాల సేవలు నిలిచిపోయినట్లు ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు.
సేవలు ఎప్పటికి పునరుద్దరణ అవుతాయో అధికారులు స్పష్టత ఇవ్వలేకపోవటంతో.. ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. లావాదేవీలు ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఖాతాదారుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమ ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. యూపీఐ విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఏటీఎం కేంద్రాల్లో నగదు ఉపసంహరణలు కూడా జరగడం లేదని పేర్కొంటున్నారు.