ఒకప్పుడు వంటింటికే పరిమితమైన స్త్రీ.. నేడు అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఈ స్థాయికి రావడానికి తాను ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు, అవమానాలు ఎదుర్కొంది. అమ్మాయికి చదువు అవసరమా? ఆడపిల్లల్ని బయటకు పంపించడమా? అని ఇటు కుటుంబం అటు సమాజం తన కాళ్లకు సంకెళ్లు వేసిన ప్రతిసారి రెక్కలనే బలంగా చేసుకుని తన కలల్ని సాకారం చేసుకునేందుకు ఆకాశానికి ఎగురుతూనే ఉంది.
ఈ ప్రయాణంలో తాను ఎన్నో మెట్లు ఎక్కింది. మరెన్నో విజయాలు తన కొంగున కట్టుకుంది. ప్రస్తుతం స్త్రీ ప్రవేశించని రంగమంటూ దాదాపుగా లేదు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో పురుషులతో సమానంగా, వారికి దీటుగా రాణిస్తోంది. ఒకప్పుడు ఇంటికే పరిమితమై.. తన వాళ్లకు ఏం కావాలో తెలుసుకుని వెంటనే ఏర్పాటు చేసే స్త్రీ.. నేడు సామాజిక బాధ్యత తనపై వేసుకుని సమాజానికి తనవంతు సాయం చేస్తోంది. పురుషుడిపై భారం పడకుండా ఇంటి బాధ్యతను తీసుకున్న మహిళ.. నేడు వ్యాపార రంగాన్ని శాసిస్తోంది. తన వాళ్లకు ఏం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకునే అతివ.. దేశ భద్రత కోసం నడుం బిగిస్తోంది.
అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి.. ఆటలు ఆడకూడదన్న సమాజపు పోకడను నిలువునా చీల్చి బుల్లెట్లా దూసుకెళ్తోంది. తన వాళ్ల కోసం నిరంతరం తపిస్తూ తనకేం కావాలో మర్చిపోయిన ఆడది.. నేడు తనకు నచ్చిన పని చేయడానికి ఆసక్తి చూపుతోంది. తన కలను సాకారం చేసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.
పనిచేసే చోట వేధింపులు, చీత్కారాలు, అవమానాలు అన్నింటిని ఎదుర్కొంటున్న మహిళ.. అడ్డంకులన్నింటిని ఆత్మవిశ్వాసంతో అధిగమించి తన గమ్యాన్ని చేరుకుంటోంది. లింగ వివక్ష పోవడానికి, తనపై వేధింపులు, దాడులు ఆగడానికి మహిళ నిత్యం పోరాటం చేస్తూనే ఉంది. మేధాపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పురుషుడికి సమఉజ్జీ అయిన స్త్రీ.. ఎటువంటి కార్యకలాపాల్లోనైనా మగవారికి దీటుగా రాణిస్తోంది.
అయినాసరే.. తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు. పురుషులతో సమానమైన గుర్తింపు లభించడం లేదు. పురుషుడి కంటే రెండుపాళ్లు ఎక్కువ కష్టపడుతున్న మగువ.. తనకు కావాల్సింది మహిళా దినోత్సవం పేరిట ఒక్కరోజు ప్రత్యేక గుర్తింపు కాదని.. తను చేసే పనికి కాస్త గుర్తింపు.. తనకు దక్కాల్సిన గౌరవం ఇస్తే చాలని కోరుకుంటోంది.