తెలంగాణ

telangana

ETV Bharat / city

విమెన్స్​ డే స్పెషల్: విమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌ - తెలంగాణ వార్తలు

కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా.. ఇలా తమ జీవితంలో వివిధ పాత్రల్ని సమర్థంగా పోషిస్తోన్న మహిళలను గౌరవిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే వేడుకే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. సమాజంలో మహిళలకున్న హక్కుల్ని గుర్తు చేసుకుంటూ, వారిని సాధికారత దిశగా నడిపించడానికి ఏటా ఒక అంశాన్ని ఎంచుకుని విమెన్స్‌ డేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. స్త్రీ శక్తిని చాటేలా, వారిని అభివృద్ధి పథంలో నడిపించేలా వివిధ దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాల్ని సైతం నిర్వహిస్తుంటారు. మరి, ఈసారి మహిళా దినోత్సవం ఏ అంశంతో మన ముందుకొచ్చింది? ఎలాంటి సందేశాన్ని మహిళా లోకానికి అందించనుంది? తెలుసుకుందాం రండి..

choose to challenge, international women's day
విమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌, అంతర్జాతీయ మహిళా దినోత్సవం

By

Published : Mar 8, 2021, 7:02 PM IST

ప్రపంచవ్యాప్తంగా మహిళలు సమానత్వం సాధించి సాధికారత దిశగా అడుగు వేయాలని, వారిపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలు అంతమొందాలన్న లక్ష్యంతో 1975 నుంచి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని అధికారికంగా నిర్వహిస్తోంది ఐక్యరాజ్యసమితి. మహిళలకు స్ఫూర్తి కలిగించే థీమ్స్‌తో ఏటా దీనిని వేడుకగా సెలబ్రేట్‌ చేస్తోంది. అలా ఈ ఏడాది కూడా మహిళా సాధికారతకు సంబంధించి ఒక ప్రత్యేక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. అదే ‘విమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌: అఛీవింగ్ యాన్ ఈక్వల్‌ ఫ్యూచర్‌ ఇన్‌ ఎ కొవిడ్‌-19 వరల్డ్‌’.

ఛాలెంజ్‌ను స్వీకరిద్దాం.!

నాయకురాలు కావాలి!

నాయకురాలు కావాలి

ప్రపంచం అభివృద్ధి పథంలో పయనించాలంటే మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, నాయకత్వ బాధ్యతలను స్వీకరించేందుకు సైతం సంసిద్ధంగా ఉండాలని ఈ థీమ్‌ స్పష్టం చేస్తోంది. అలాగే కొవిడ్‌ మహమ్మారిపై పోరులో కరోనా యోధులుగా మహిళలు చేస్తోన్న కృషిని సైతం కొనియాడింది. అయితే ఈ క్రమంలో మహిళలు పురుషులతో సమానంగా పోరాటం చేస్తున్నా ఇంకా లింగ వివక్ష, వేతన వ్యత్యాసం కనిపిస్తోందని, ఈ అసమానతల్ని చెరిపేసే దిశగా అన్ని సంస్థలు చొరవ చూపాలన్న ముఖ్యోద్దేశంతోనే ఈ అంశంతో ఈసారి మన ముందుకొచ్చింది ఐరాస.

ఆ బాధ్యతలు స్వీకరిస్తూ..!

ఆ బాధ్యతలు స్వీకరిస్తూ..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌పై స్త్రీలు కూడా పురుషులతో సమానంగా కలిసి పోరాడుతున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అత్యవసర సేవల విభాగాల్లో ముందుండి పని చేస్తున్నారు. అంతేకాదు.. కొన్ని దేశాల్లో పురుషుల కంటే మహిళలే ముందుండి కొవిడ్‌పై పోరాటం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ పురుషులతో పోలిస్తే మహిళలు 11 శాతం తక్కువ వేతనాలు అందుకున్నారని తాజా నివేదిక చెబుతోంది. ఇక పర్యావరణ పరిరక్షణ లాంటి సామాజిక సమస్యలపై కూడా ఎందరో మహిళలు తమ గళాన్ని వినిపించారు. ఇలా విభిన్న రంగాల్లో ముందడుగు వేస్తోన్న మహిళలు నాయకత్వం, నిర్ణయాధికారం.. వంటి విషయాల్లో మాత్రం వెనకబడి పోయారని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు సంసిద్ధం కావాలన్న స్ఫూర్తిని మహిళల్లో నింపేందుకే ఈ ఏడాది ఈ థీమ్‌ని తెరమీదకు తీసుకొచ్చింది ఐక్యరాజ్యసమితి.

ఛాలెంజ్ చేద్దాం!

ఛాలెంజ్ చేద్దాం!

ఇక సమాజంలోని లింగ అసమానతలను సమూలంగా రూపుమాపాలంటే మహిళలు ఎలాంటి పరిస్థితులనైనా సవాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలంటోంది ‘ఇంటర్నేషనల్‌ విమెన్స్‌ డే’ అధికారిక వెబ్‌సైట్. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సరిగ్గా ఇదే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా #ChooseToChallenge అన్న థీమ్‌తో ఈసారి విమెన్స్‌ డే వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చింది. పురుషులతో పోలిస్తే మహిళలకు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే స్త్రీలు వాటిని తమ ఆలోచనలు, చేతలతో అధిగమించాలని.. ఇది అంతిమంగా లింగ సమానత్వాన్ని సాధించడానికి దోహదం చేస్తుందని, అందుకే ఈ ఏడాది #ChooseToChallenge థీమ్‌తో మహిళల విజయాలను స్మరించుకుందామని ‘ఇంటర్నేషనల్‌ విమెన్స్‌ డే’ అధికారిక వెబ్‌సైట్‌ తెలిపింది. ఇదే సమయంలో నేటితరం మహిళలు ఎలాంటి పరిస్థితులనైనా సవాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామనడానికి గుర్తుగా చెయ్యి పైకెత్తి చూపుతూ దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవాలని పిలుపునిచ్చింది.

ఇదీ చదవండి:ఎవరు ఎవర్ని ఆదుకుంటున్నారో అర్థమవుతోంది: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details