ఇలవరసీ ఇంట్లో తాతల కాలం నుంచి తల్లిదండ్రుల వరకు అందరూ స్వీట్లు, కారాలు, చిప్స్ తయారుచేసేవారు. వాటిని ఇంటింటికీ తిరిగి విక్రయించేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో వారితోపాటు తాను కూడా అమ్ముతూ, తన వంతు సాయం చేసేదీమె. అలాగే అమ్మమ్మ, అమ్మతో కూర్చుని వారు వండే వంటకాల గురించి తెలుసుకుంటూ, అడిగి తయారుచేయడమెలాగో నేర్చుకునేది. తానూ పెద్దైన తరువాత వారిలాగే ఇదే రంగంలో అడుగుపెట్టి మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని చిన్నప్పటి నుంచి కలలు కనేది.
పెళ్లై అత్తారింటికి వచ్చిన ఆమెకి మనసులో ఆలోచన మాత్రం అలాగే ఉండిపోయింది. భర్తతో తన కల గురించి చెప్పింది. అత్తింటి సహకారంతో పలురకాల స్వీట్లు, స్నాక్స్ చేసి ఇంటికి చుట్టుపక్కల ఉండే దుకాణాలకు అమ్మేది. వినియోగదారులు ఇష్టపడితే వాటిని మళ్లీ వండి తీసుకొస్తానని చెప్పేది. అలాగే పొరుగువారికీ తన వంటల రుచిని చూపించేది. అలా కొన్నాళ్లకు ఇలవరసీ వంటల రుచికి అందరూ ఫిదా అయిపోయేవారు. ఇళ్లకు, చిన్నచిన్న దుకాణాలకు మాత్రమే కాకుండా చిన్న సూపర్‌మార్కెట్‌లా తెరవాలనుకుంది. అదే విషయం భర్తకు చెప్పి, ఆయన అనుమతితో త్రిసూరులో ప్రారంభించాలనుకున్నారు. దాంతో అప్పటివరకు పొదుపు చేసిన నగదుతోపాటు, తెలిసినవారి వద్ద, బ్యాంకులో రుణాన్ని తీసుకుని రూ.50 లక్షలు పెట్టుబడితో పదేళ్లక్రితం చిన్న మార్ట్‌ను ప్రారంభించింది. ఇందులో రకరకాల స్నాక్స్, చిప్స్‌ను ప్రత్యేకంగా ఉంచేది.
విక్రయాలు పెరిగి..
ఇలవరసి వంటకాలను ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుగోలు చేసేవారు. నెమ్మదిగా వ్యాపారం అభివృద్ధి చెందింది. 50 మంది పేద మహిళలకు అందులో ఉపాధిని కల్పించింది. వినియోగదారుల అభిరుచినీ దృష్టిలో ఉంచుకుని రకరకాల వంటకాలను తయారుచేసేదీమె. అలా హల్వా, కేకులు, చిప్స్ నుంచి కూరగాయలు, నిత్యావసరవస్తువుల సంఖ్యనూ పెంచింది. నెమ్మదిగా అప్పులు తీరుస్తున్న సమయానికి అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఓ అర్ధరాత్రి దుకాణంలో దోపిడి జరిగింది. ఓవైపు బ్యాంకు రుణం, తెలిసినవారి వద్ద తీసుకున్న అప్పులు ఆమెను చుట్టుముట్టాయి. దాంతో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైంది.
కొన్ని నెలలపాటు ఆసుపత్రిలోనే గడిపిన తనకు జీవితమేంటో తెలిసింది అని చెబుతోందీమె. ‘ఆసుపత్రి నుంచి వచ్చాక తిరిగి వ్యాపారం మొదలుపెడదామనుకున్నా. చేతిలో చిల్లిగవ్వ లేదు, ఇంట్లోవాళ్లు వద్దన్నారు. అప్పటికి చేతిలోని రూ.100 పెట్టుబడి అయ్యాయి. ‘అశ్వతి హాట్ చిప్స్’ పేరుతో త్రిసూరు రైల్వేస్టేషన్ వద్ద చిన్న కొట్టు తెరిచా. గారెలు, చిప్స్‌ను రైలు ప్రయాణికులకు విక్రయించేదాన్ని. అలా కొన్నినెలలపాటు కష్టపడ్డా. నా కష్టం చూసి కుటుంబం అండగా నిలబడింది. అలా ఆర్నెళ్లలో వ్యాపారం నిలదొక్కుకుంది. ఎనిమిదేళ్లలో మొత్తం అప్పులు తీరిపోగా, మరో నాలుగు శాఖలనూ ప్రారంభించాం. ఇప్పుడు నెలకు అయిదు లక్షల రూపాయలను సంపాదించగలుగుతున్నా. మరికొందరు మహిళలకు ఉపాధినీ చూపించగలిగా. నా పట్టుదల, కృషికి గుర్తింపుగా 2019లో ‘ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ యుఏఈ అవార్డు’ పేరుతో ఉత్తమ వాణిజ్యవేత్తగా పురస్కారాన్ని అందుకున్నా’ అని చెబుతోంది ఇలవరసి.